పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మృతి
వరంగల్ టైమ్స్, ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దుబాయ్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. ముషారఫ్ 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించారు. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్ లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. లాహోర్ లోని ఫోర్మాన్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత విద్యనభ్యసించారు.
1964లో పాకిస్థాన్ సైన్యంలో చేరారు. క్వెట్టాలోని ఆర్మీ స్టాఫ్ అండ్ కమాండ్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయ్యారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి పాక్ సైనికదళాల ప్రధానాధికారి పదవిని చేపట్టారు. 1993లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ సర్కార్ పై తిరుగుబాటు చేసి సైనిక పాలకుడి పగ్గాలు చేజిక్కించుకున్నారు. రెండేండ్ల తర్వాత పాక్ 10వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.2001 నుంచి 2008 వరకు దేశాధ్యక్షుడిగా పని చేశారు. ఐతే కొన్ని ఆరోపణలను తప్పించుకునేందుకు తన పదవికి రాజీనామా చేశారు.
కాగా 2014 మార్చి 31న దేశద్రోహం కేసులో ఆయనను ఇస్లామాబాద్ లోని ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. దేశద్రోహం నేరం కింద మరణశిక్ష విధించింది. దీంతో అరెస్ట్ చేస్తారనే భయంతో ఆయన దుబాయ్ పారిపోయారు. మార్చి 2016 నుంచి దుబాయ్ లోనే ఆశ్రయం పొందుతున్నారు. 1999 లో జరిగిన కార్గిల్ యుద్ధానికి ఆయనే ప్రధాన కారకుడు.