తొలి టెస్టులో ఆసిస్ పై భారత్‌ ఘన విజయం

తొలి టెస్టులో ఆసిస్ పై భారత్‌ ఘన విజయం

వరంగల్ టైమ్స్, నాగ్ పూర్ : తొలి టెస్టులో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 132 పరుగులతో కంగారూలను టీం ఇండియా చిత్తు చిత్తుగా ఓడించింది. కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్ ను ముగించి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అశ్విన్‌(5), జడేజా(2), అక్షర్‌(1) స్పిన్‌ ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 91 పరుగులకే కుప్పకూలింది. చివర్లో షమి రెండు వికెట్లు తీశాడు.

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 177 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్‌ బ్యాటర్లలో స్టీవ్‌ స్మిత్‌ 25 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌ గా నిలిచాడు.ఈ ఇన్నింగ్స్ లో అదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఈ తర్వాత మార్నస్ లబుశ్చగ్నే, డేవిడ్ వార్నర్, అలెక్స్ క్యారీ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన భారత్‌ జట్టు 400 పరుగుల భారీ స్కోరు చేసి 223 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం తన రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా 32.3 ఓవర్లలో 91 పరగులు చేసి ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో రవిచంద్రన్ అశ్విన్ అత్యధికంగా ఐదు వికెట్లు తీసి ఆస్ట్రేలియా జట్టు నడ్డి విరిచాడు. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీసుకున్నారు. అక్షర్ పటేల్ కు ఒక వికెట్ పడింది. ఈ మ్యాచ్‌లో షమి ఓ అరుదైన ఫీట్‌ సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 25 సిక్సులతో ఫుల్‌ టైం బ్యాటర్‌ కోహ్లీ(24 సిక్సులు)ని అధిగమించాడు.