ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ లో భారత్ ఓటమి 

ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ లో భారత్ ఓటమి

వరంగల్ టైమ్స్ , స్పోర్ట్స్ డెస్క్ : మహిళల వరల్డ్ కప్ లో భారత్ కు మరో ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. చార్లీ డీన్ ( 4/23), శ్రుభ్ సోల్ (2/20) ధాటికి టీంఇండియా 36.2 ఓవర్లలో 134 రన్స్ కు కుప్పకూలింది. ఓపెనర్ స్మృతి మందన (35), రిచా ఘోష్ (33) మినహా బ్యాటింగ్ లో అందరూ ఫెయిలయ్యారు. యస్తికా భాటియా ( 8) తో మొదలైన టీంఇండియా వికెట్ల పతనం ఆఖరి వరకు కొనసాగింది. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ లో భారత్ ఓటమి అయితే ఫాంమీదున్న మందన, హర్మన్ ప్రీత్ కౌర్ (14) ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 33 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివరిలో రిచా ఘోష్, జులన్ గోస్వామి ( 20 ) బ్యాట్ ఝులిపించడంతో భారత్ కు గౌరవప్రదమైన స్కోర్ దక్కింది.

ఇక స్వల్ప లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ బ్యాటింగ్ హెచ్చుతగ్గులుగా సాగింది. 4 పరుగులకే ఓపెనర్లు టామీ బ్యూమౌంట్ ( 1 ), వ్యాట్ (1) పెవిలియన్ చేరారు. అయితే కెప్టెన్ హిథర్ నైట్ (53 నాటౌట్ ), నాట్ స్కీవర్ ( 45 ) క్రీజులో కుదురుకోవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. 31.2 ఓవర్లలో ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది.

మేఘనసింగ్ ( 3/26) మూడు వికెట్లతో ఆకట్టుకుంది. డీన్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. వన్డేలో 250 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా టీంఇండియా పేసర్ జులన్ గోస్వామి నిలిచింది. ఫిట్జ్ ప్యాట్రిక్ ( 180 ), అనిసా ( 180 ) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

సంక్షిప్త స్కోర్ : భారత్ : 36.2 ఓవర్లలో 134 ఆలౌట్ ( మందన 35, రిచాఘోష్ 33, డీన్ 4/23 )
ఇంగ్లండ్ : 31.2 ఓవర్లలో 136/6 ( నైట్ 53 నాటౌట్, స్కీవర్ 45, మేఘన సింగ్ 3/26 )