రాష్ట్రంలో ఇండస్ట్రిస్ కు తొలి ప్రాధాన్యత : సీఎం జగన్‌

పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత
రాష్ట్రంలో ఇండస్ట్రియల్‌ కారిడార్లు, పోర్టుల నిర్మాణంపై స‌మీక్ష‌లో సీఎం జగన్‌

రాష్ట్రంలో ఇండస్ట్రిస్ కు తొలి ప్రాధాన్యత : సీఎం జగన్‌అమ‌రావ‌తి‌: పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాల‌ని, రెండున్నరేళ్లలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణాలు పూర్తి కావాల‌ని, కొప్పర్తి పారిశ్రామిక క్లస్టర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్‌ కారిడార్లు, పోర్టుల నిర్మాణంపై సీఎం జగన్ గురువారం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి, ఆ విమానాశ్రయం నుంచి విశాఖ సిటీకి సత్వరమే చేరుకునేలా వేగంగా బీచ్‌ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి కావాలి, పోలవరం నుంచి విశాఖకు పైపు లైన్‌ ద్వారా తాగునీటి సరఫరా కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీఆపీఆర్‌) వెంటనే సిద్ధం చేయాలి, పైమూడు పనులకు సంక్రాంతిలో శంకుస్థానకు అధికారులు సన్నద్ధం కావాలి అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారుల‌ను ఆదేశించారు. సమీక్షలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.కరికాల్‌ వలవెన్, పరిశ్రమల డైరెక్టర్‌ జెవిఎన్‌ సుబ్రమణ్యం, ఏపీఐఐసీ వీసీ ఎండీ కె.రవీన్‌కుమార్‌రెడ్డి, ఏపీ మారిటైమ్‌ బోర్డు సీఈఓ ఎన్‌పీ రామకృష్ణారెడ్డి, ఏపీఐఐసీ ఈడీ పి.ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు. సీఎం జ‌గ‌న్ మాట్లాడారు.

రామాయపట్నం పోర్టుకు డిసెంబర్‌ 15 కల్లా టెండర్లు ఖరారు చేసి, పనులు అప్పగిస్తామని, పోర్టు ప‌నులు వచ్చే ఏడాది (2021) ఫిబ్రవరిలో మొదలుపెడతామన్న అధికారులు మొదటి దశలో 4 బెర్తులతో ఏడాదికి 15 మిలియన్‌ టన్నుల కార్గో హ్యాండిల్‌ చేస్తామని వెల్లడించారు. భావనపాడు పోర్టుకు డిసెంబర్‌ 15 కల్లా టెండర్లు ఖరారు చేసి, పనులు అప్పగిస్తామని మార్చి 2021 నుంచి పనులు మొదలుపెడతామని, మొదటి దశలో 4 బెర్తులతో 25 మిలియన్‌ టన్నుల కార్గో హ్యాండిల్‌ చేస్తామని తెలిపారు. మచిలీపట్నం పోర్టుకు వచ్చే ఏడాది (2021) ఫిబ్రవరి 15 కల్లా టెండర్లు ఖరారు చేసి, ఏప్రిల్, 2021 నుంచి పనులు మొదలుపెడతామని, మొదటి దశలో 6బెర్తులతో 26 మిలియన్‌ టన్నుల కార్గో హ్యాండిల్‌ చేస్తామని వెల్లడించారు. ఈ మూడు పోర్టుల పనులన్నీ రెండున్నర ఏళ్లలో పూర్తి చేసేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు విశాపట్నం–చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడర్‌లోని విశాఖపట్నం నోడ్‌లో అచ్యుతాపురం క్లస్టర్, నక్కపలి క్లస్టర్లో పనుల తీరును వివరించిన అధికారులు. రాంబిల్లి ప్రాంతంలో పోర్టు నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. తద్వారా విశాఖపట్నం పోర్టుపై ఒత్తిడి తగ్గించ వచ్చని, ఇంకా కాలుష్యాన్ని కూడా తగ్గించే అవకాశాలుంటాయని సీఎం పేర్కొన్నారు. శ్రీకాళహస్తి, ఏర్పేడు నోడ్‌లో కార్యకలాపాలను వివరించిన అధికారులు ఎయిర్‌ కార్గో అవసరాన్ని వివరించారు. తిరుపతి, నెల్లూరు, కడప విమానాశ్రయాల్లో ఎయిర్‌ కార్గో సదుపాయాలను పెంచడంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఓర్వకల్‌ నోడ్‌లో కార్యకలాపాలను అధికారులు వివ‌రించ‌గా పరిశ్రమలకు వీలైనంత వరకూ డీశాలినేషన్‌ వాటర్‌ను వినియోగించేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఇండస్ట్రియల్‌ కారిడార్లు, పారిశ్రామిక వాడల్లో మురుగునీటి పారిశుద్ధ కేంద్రాల (ఎస్పీటీ) ఏర్పాటు తప్పనిసరని పేర్కొంటూ పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవ‌కుండా చూడాలని సీఎం ఆదేశించారు.