కోల్ కతా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ పరాజయం
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోరంగా ఓటమి చవిచూసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా, ఆండ్రీ రస్సెల్ (49 నాటౌట్), శామ్ బిల్లింగ్స్ (34), రహానే (28), నితీష్ రాణా (26) రాణించడంతో 20 ఓవర్లలో 177 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్లు తీవ్రంగా తడబడ్డారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (9) మరోసారి పేలవ ప్రదర్శన చేయగా, ఫాంలో ఉన్న రాహుల్ త్రిపాఠీ (9) కూడా ఫెయిలయ్యాడు. సౌథీ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ తో పెవిలియన్ చేరాడు.ఆ తర్వాత ఇన్నింగ్స్ సెట్ చేయడానికి ట్రై చేసిన అభిషేక్ శర్మ (43), ఎయిడెన్ మార్క్రమ్ (32) కాసేపు పోరాడురు. వాళ్లు ఔటైన తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ (2), వాషింగ్టన్ సుందర్ (4), శశాంక్ సింగ్ (11), మార్కో జాన్సెన్ (1) ఫెయిలయ్యారు. చివరిలో భువనేశ్వర్ కుమార్ (6 నాటౌట్ ), ఉమ్రాన్ మాలిక్ (3 నాటౌట్ ) టీం ఆలౌట్ కాకుండా కాపాడారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి సన్ రైజర్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 123 రన్స్ చేసింది. దీంతో కోల్ కతా టీం 54 రన్స్ తేడాతో సూపర్ విక్టరీ సాధించింది.
ఈ ఓటమితో సన్ రైజర్స్ దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నట్లే. అదే టైంలో కోల్ కతాకు తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కోల్ కతా బౌలర్లలో రస్సెల్ 3, సౌథీ 2 వికెట్లు తీశారు. సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.