భాషా ద్రోహానికి పాల్పడుతున్న జగన్ ప్రభుత్వం!

భాషా ద్రోహానికి పాల్పడుతున్న జగన్ ప్రభుత్వం!

భాషా ద్రోహానికి పాల్పడుతున్న జగన్ ప్రభుత్వం!

వరంగల్ టైమ్స్, అమరావతి : మాతృభాష పరిరక్షణ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మాజీ ఉససభాపతి మండలి బుద్ధప్రసాద్ మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వం భాషాద్రోహానికి పాల్పడుతుందని ఆయన విమర్శించారు. ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండలి బుద్ధప్రసాద్ మాట్లాడారు. యునెస్కో ప్రాథమిక విద్య మాతృభాషలో జరపాలని, మాతృభాషలు.. మృతభాషలు కాకుండా చూసుకోవాలని ఆయన కోరారు.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏర్పరిస్తే, ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాధ్యమాన్ని తీసివేసి ప్రాథమిక విద్య కూడా ఇంగ్లీషులోనే బోధిస్తుండటం సిగ్గుచేటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా పిల్లలు తమ పేరు కూడా తెలుగులో రాసే పరిస్థితి లేదని బుద్ధప్రసాద్ అన్నారు. అక్షరాలు నేర్పని జాతిని రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తుందని అన్నారు.

తెలుగు భాష కోసం ఏర్పరిచిన అధికార భాషా సంఘం, తెలుగు అకాడమీ, సాహిత్య అకాడమీ లాంటి సంస్థలను ఉత్సవ విగ్రహాలుగా మార్చి వేశారని ఆరోపించారు. కేవలం తమ అనుయాయులకు పదవులు ఇచ్చి జీతభత్యాలు చెల్లిస్తున్నారు తప్ప, భాష కోసం చేసింది శూన్యమని బుద్ధప్రసాద్ విమర్శించారు. ఇప్పటికైనా తెలుగు వారు మేల్కొని భాషను కాపాడుకోవాలని, భాషా పూర్వకంగా ఏర్పడిన జాతిని నిలుపుకోవాలని బుద్ధ ప్రసాద్ కోరారు.