మేడ్చల్ బరిలో కాసాని ? 

మేడ్చల్ బరిలో కాసాని ? మేడ్చల్ బరిలో కాసాని ? 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : తెలంగాణ టీటీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఏం టైమ్ లో పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చారో కానీ పార్టీ అయితే కొంత యాక్టివ్ అయ్యినట్లే కనిపిస్తోంది. తరచూ సమావేశాలు నిర్వహిస్తూ తెలంగాణలో టీడీపీకి కొత్త జవసత్వాలు అందించేందుకు కాసాని ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిశగా తెలంగాణలో టీడీపీ నుంచి ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై ఇప్పటి నుంచే కసరత్తు మొదలైందని సమాచారం. అందులో భాగంగానే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మేడ్చల్ నుంచి పోటీచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్.

* మేడ్చల్ పై కాసాని ఆసక్తి !
కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సొంత జిల్లా మేడ్చల్ మల్కాజ్ గిరి. గతంలో ఆయన జడ్పీటీసీగా గెలిచి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మెన్ గా పనిచేశారు. ఒక దశలో టీడీపీలో ముఖ్య నాయకుడిగా ఎదిగారు. కానీ వైఎస్ జమానాలో ఆయన పార్టీ మారక తప్పలేదు. కొద్ది కాలం పాటు ఎమ్మెల్సీగాను వ్యవహరించారు. చివరకు సొంతంగా పార్టీ పెట్టి ఎదురుదెబ్బ తిన్నారు. అయినప్పటికీ కాసానికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. బీసీ నాయకుడిగా ఆయనకు పేరుంది. అందుకే కాసానికి పిలిచి మరీ తెలంగాణ టీడీపీ చీఫ్ గా కీలక బాధ్యతలు అప్పజెప్పారు చంద్రబాబు. కాసానికి ఉన్న అనుభవం దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు బాధ్యతలు కూడా ఆయనకే అప్పజెప్పాలని నిర్ణయించినట్లు టాక్. ఆ ప్లానింగ్ లో భాగంగానే కాసాని తనకంటూ ప్రత్యేకతను చాటుకోవడానికి మేడ్చల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

మేడ్చల్ బరిలో కాసాని ? 

 

* మల్లారెడ్డిని ఢీకొట్టేందుకు సిద్ధం !
మేడ్చల్ నుంచి ప్రస్తుతం మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఇక్కడి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మేడ్చల్ లో ఒక సెంటిమెంటు మల్లారెడ్డికి ప్రతికూలంగా మారే అవకాశముంది. అది ఏంటంటే 2004 నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా రెండో సారి విజయం సాధించిన దాఖలాలు లేవు. అందుకే ఈసారి కూడా అదే సెంటిమెంటు పనిచేస్తుందని కాసాని వర్గం భావిస్తోందట. అన్నింటికి మించి కాసానికి ఇక్కడ ఊరూరా మంచి పరిచయాలున్నాయి. పార్టీల కతీతంగా అందరితో సత్సంబంధాలున్నాయి. మల్లారెడ్డిపై వ్యతిరేకత ఉందని కాసాని వర్గం భావన. ఇవన్నీ కలిసొచ్చి కాసాని విజయబావుటా ఎగరేస్తారని ఆయన వర్గం భావిస్తున్నారట. అందుకే మేడ్చల్ లో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

* సెటిలర్ల మద్దతు కూడగట్టేందుకు ప్లాన్ !
మేడ్చల్ లో ఇప్పటికే కాసాని జ్ఞానేశ్వర్ వర్గం వరుసగా మీటింగులు నిర్వహిస్తున్నట్లు టాక్. ఊరూరా టీడీపీ జెండా కనిపించేలా ప్లాన్ చేసుకుంటున్నారట. గతంలో జడ్పీ చైర్మన్ గా తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలిసేలా కాసాని ప్రణాళికను రూపొందించుకునే పనిలో ఉన్నారట. అంతేకాకుండా ఇక్కడ సెటిలర్లు పెద్ద మొత్తంలోనే ఉండడం తనకు కలిసొస్తుందని కాసాని భావిస్తున్నారట. చంద్రబాబు కూడా కాసాని ఆలోచనతో ఏకీభవించినట్లు తెలుస్తోంది. పోటీకి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకోవాలని కూడా బాబు సూచించినట్లు టాక్.

తెలంగాణలో పాగాకు టీడీపీ సిద్ధమవుతున్న తరుణంలో ఆ పార్టీ చీఫ్ గా కాసాని జ్ఞానేశ్వర్ కొంత సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే మేడ్చల్ బరిలో నిలవాలని ఆలోచిస్తున్నారట. త్వరలోనే ఆదిశగా ప్రకటన చేయాలని అనుకుంటున్నారట. మరి కాసాని ప్లాన్ వర్కవుట్ అవుతుందా మంత్రి మల్లారెడ్డికి కాసాని బ్రేకులేస్తారా టీడీపీ జెండా ఎగరేస్తారా అన్నది చూడాలి.