ఓరుగల్లుపై కేటీఆర్ స్పెషల్ ఫోకస్..ఎందుకు !?
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్ద పట్టణం వరంగల్. అంతేకాకుండా ఉత్తర తెలంగాణకు ముఖద్వారం ఓరుగల్లు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఆయువుపట్టుగా నిలిచింది. స్వరాష్ట్ర కాంక్షను బలంగా చాటిచెప్పింది.
* కేసీఆర్ వెన్నంటే ఉన్న ఓరుగల్లు..
ముఖ్యంగా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తొలినాళ్ల నుంచి ఇప్పటివరకు ఆయన వెన్నంటే నిలిచింది. తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించడంలో కేసీఆర్ కు కొండంత అండగా నిలబడింది. ఇప్పటికీ సీఎం కేసీఆర్ ఒక్క పిలుపిస్తే చాలు మేమున్నామంటూ కదం తొక్కేందుకు గులాబీశ్రేణులు, జనాలు సిద్ధంగా ఉన్నారు. అంతలా కేసీఆర్ ను ఆరాధించే వీరాభిమానులు ఇక్కడ ఉన్నారు. కేసీఆర్ ను ఒక నాయకుడిలా కాదు దేవదూతలా భావించే జనం ఓరుగల్లులో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అందుకే ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే కేసీఆర్ కు ఎంతో ప్రాణం.
* కేటీఆర్ కు ప్రత్యేక అభిమానమే
మంత్రి కేటీఆర్ కు కూడా వరంగల్ అంటే ప్రత్యేక అభిమానం. అందుకే ఆయన కూడా ఓరుగల్లుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎప్పుడు సమయం దొరికినా ఇక్కడి అభివృద్ధిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉంటారు. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటనల పరంపర కొనసాగిస్తున్నారు మంత్రి కేటీఆర్. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి, ఉమ్మడి వరంగల్ పై ప్రత్యేక ప్రేమను చాటుకున్నారు.
* కంచుకోటను కాపాడుకునే దిశగా అడుగులు
టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఓరుగల్లుకు మరింత ప్రాధాన్యత పెరిగింది. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ గులాబీపార్టీకి కంచుకోట. ఇక్కడ స్వీప్ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా తిరుగు ఉండదని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ భావిస్తున్నారట. బీజేపీ నుంచి గట్టి కౌంటర్ ఎదురవుతున్న తరుణంలో ఓరుగల్లులో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా బీఆర్ఎస్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ కంచుకోటలో మరోసారి సత్తా చాటేందుకు గట్టి కార్యాచరణను సిద్ధం చేసే పనిలో ఉన్నారట.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే ఉమ్మడి ఓరుగల్లులో బీఆర్ఎస్ చాలా బలంగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఆ పార్టీలకు గులాబీపార్టీని నిలువరించేంత దమ్ము అయితే లేదనే చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ కు ఓరుగల్లులో హేమాహేమీలైన నేతలున్నారు. వరంగల్ కు ప్రముఖ నేతల పేర్లను తీసుకుంటే అందులో 90 శాతం కంటే ఎక్కువమంది గులాబీ పార్టీలోనే ఉన్నారు.
* అందరూ రాజకీయ ఉద్దండులే
ఓరుగల్లు నుంచి బీఆర్ఎస్ లో ఉన్న నేతల లిస్టు చూస్తే చాలానే ఉంది. అందులో ప్రముఖుల విషయానికొస్తే మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, రాజయ్య, రెడ్యా నాయక్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు గండ్ర, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి… ఇలా ఎంతోమంది హేమాహేమీలైన నేతలున్నారు. ఇంతమంది ప్రముఖులు ఒక్క జిల్లాలోనే ఉండడం మరెక్కడా లేరంటే అతిశయోక్తి కాదు. అందరూ ఉద్దండులే. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఒక్క పిలుపిస్తే చాలు పార్టీని ముందుండి నడిపించే సత్తా ఉన్న నాయకులే. ఇక కాంగ్రెస్ నుంచి సీతక్క, కొండా సురేఖ లాంటి ఒకరిద్దరు ప్రముఖ నేతలుండగా.. బీజేపీ నుంచి ఆస్థాయిలో చెప్పుకోతగ్గ నేతలెవరూ లేరనే చెప్పాలి.
సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలు బీఆర్ఎస్ కు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఓరుగల్లులో కేసీఆర్ పాలనపై పాజిటివ్ వాతావరణం ఉంది. రాష్ట్రంలో రెండు సార్లు అధికారంలో ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ పై ప్రజల్లో అంతగా వ్యతిరేకత అయితే లేదు. ఉంటే గింటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఉండే అవకాశముంది. అందుకే సానుకూల వాతావరణం ఉన్న ఓరుగల్లులో మరింత ప్లానింగ్ తో స్వీప్ చేయాలన్న దృఢ సంకల్పంతో కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని గులాబీ శ్రేణులు చెబుతున్నారు.
* ఆ ఇద్దరి పని తీరు సూపర్
రాష్ట్రవ్యాప్తంగా బాగా పనిచేసే మంత్రుల లిస్టులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల పేర్లు ఉండడం కలసి వచ్చే అంశమే. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఇద్దరూ చురుకైన నేతలుగా పేరు తెచ్చుకున్నారు. తమ తమ శాఖల్లో అత్యుత్తమ పనితీరును కనబర్చారు. పైగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితులు. ఆ ప్రభావం ఫలితంగా జిల్లాలోనూ గులాబీపార్టీకి అనుకూల వాతావరణం ఉంది. మంత్రులిద్దరూ సమన్వయంతో ఓరుగల్లు రాజకీయాలను ముందుండి నడిపిస్తున్నారు. వీరికి కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య, మధుసూదనాచారి, గండ్ర, ఆరూరి రమేశ్ లాంటి ఉద్దండుల సహకారం కూడా పుష్కలంగా ఉంది. కొంతమంది నేతల మధ్య బేధాభిప్రాయాలున్నప్పటికీ పార్టీ దగ్గరకు వచ్చే సరికి అందరూ ఒక్కతాటిపైకి చేరుతారు. అందుకే ఇక్కడ గులాబీ పార్టీకి తిరుగులేదన్న మాట బలంగా వినిపిస్తోంది.*ప్రభుత్వ పథకాలు చేరవేయడంలో భేష్..
ప్రస్తుతం ఓరుగల్లుకు చెందిన బీఆర్ఎస్ ప్రముఖులంతా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చెప్పినట్లే నడుచుకుంటున్నారు. ఎన్నికల ముంగిట ఎలాంటి అలసత్వం లేకుండా జనాల్లోకి వెళ్తున్నారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ చేరవేయడంతో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. ప్రతి ఇంటికీ ఏదో ఒక పథకం నుంచి లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్, బీజేపీ ఇలా ప్లానింగ్ లో ఉండగానే బీఆర్ఎస్ మాత్రం పకడ్బందీ కార్యాచరణను రూపొందించింది. గులాబీ నేతలంతా అప్పుడే గ్రామాల బాట పట్టారు. ప్రతీ రోజూ జనంలోనే ఉంటూ, కేసీఆర్ పాలన గురించి వివరిస్తున్నారు.
*సర్వేలో టాప్ ప్లేసులో ఉన్నది వీళ్లే..
ఎన్నికలు ఎప్పుడొస్తాయో కానీ ఇప్పటికైతే వరంగల్ జిల్లాలో ఎలక్షన్ మూడ్ వచ్చేసింది. అందుకే కేసీఆర్, కేటీఆర్ ఓరుగల్లు పాలిటిక్స్ పై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో బీఆర్ఎస్ ప్రభావంపై సర్వేలు కూడా చేయించినట్లు తెలుస్తోంది. ఈ సర్వేల్లో గులాబీ పార్టీ మంచి మార్కులు సాధించినట్లు సమాచారం. కొంతమంది ఎమ్మెల్యేలు ఆశించిన దాని కన్నా ఎక్కువ మార్కులు సాధించినట్లు టాక్. ఎర్రబెల్లి, వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి లాంటి నాయకులు సర్వేలో టాప్ ప్లేసులో నిలిచినట్లు గులాబీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ సర్వే గురించి కేసీఆర్ ఆరా తీసినట్లు తెలిసింది. మంత్రి కేటీఆర్ జిల్లా నాయకులందరినీ పిలిచి మాట్లాడినట్లు సమాచారం. అందులో భాగంగానే తాజాగా ఓరుగల్లుకు విచ్చేసినట్లు చెబుతున్నారు.
*కేటీఆర్ పర్యటనల ఎఫెక్ట్ ..వార్ వన్ సైడే !
ఓరుగల్లులో బీఆర్ఎస్ ఎంత బలంగా ఉందో చెప్పడానికి మంత్రి కేటీఆర్ పర్యటనకు లభించిన అపూర్వ స్పందనే నిదర్శనం. ఓరుగల్లులో ఎక్కడికెళ్లినా గులాబీశ్రేణులు, జనాలు ఘన స్వాగతం పలికారు. జై కేసీఆర్ అంటూ నినదిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రి కేటీఆర్ తన పర్యటనలో అన్ని అంశాలను చాలా లోతుగా విశ్లేషించినట్లు సమాచారం. మంత్రి కేటీఆర్ టీమ్ ఆయన కంటే ముందే జిల్లాకు వచ్చి బీఆర్ఎస్ బలాబలాలపై ఆరా తీసినట్లు చెబుతున్నారు. గులాబీ పార్టీకి ఎదురులేదని కేటీఆర్ టీమ్ జరిపిన సర్వేలోనూ తేలిందని టాక్. అందుకే వరంగల్ పర్యటన సమయంలో కేటీఆర్ చాలా యాక్టివ్ గా కనిపిస్తారు. వెల్ డన్ అంటూ కొందరు నేతలను దగ్గరకు పిలిచి మరీ భుజం తట్టాడని గులాబీ శ్రేణులు చెబుతున్నారు.
*ఆ పథకాలతో ఉమ్మడి వరంగల్ లో పాజిటివ్ వెదర్ !
కేటీఆర్ టూర్ కు అపూర్వ స్పందన లభించిన తరుణంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు వార్ వన్ సైడేనన్న వాతావరణం అయితే బలంగా కనిపిస్తోంది. ఒకటి రెండు సీట్లు మినహాయిస్తే గులాబీ పార్టీ మంచి ఫలితాలు సాధించవచ్చని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కు మరింత అనుకూల వాతావరణం ఉండే అవకాశముంది. ఎందుకంటే ఎన్నికల ముంగిట కేసీఆర్ బ్రహ్మాస్త్రాల్లాంటి రెండు పథకాలను తీసుకొస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కచ్చితంగా ఆ పథకాలతో వరంగల్ లో మరింత పాజిటివ్ వెదర్ క్రియేట్ అయ్యే అవకాశముంది.
*ఇంటర్నల్ పాలిటిక్స్ ను దూరం పెట్టుకుంటే బెటర్ !
ఓరుగల్లులో బీఆర్ఎస్ దూకుడు పెంచిన తరుణంలో తమ ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ, చివరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రయత్నిస్తున్నాయి. పాదయాత్రతో రేవంత్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ లో నూతనోత్సాహం తెచ్చే ప్రయత్నం చేయగా, హాట్ కామెంట్స్ తో షర్మిల అందరినీ అట్రాక్ట్ చేసే పనిలో పడ్డారు. అయితే ప్రతిపక్షాలకు వరంగల్ లో పెద్దగా స్థానం లేనప్పటికీ గులాబీ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలే కొంపముంచే ప్రమాదం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఇంటర్నల్ పాలిటిక్స్ దెబ్బతీస్తే తప్ప బీఆర్ఎస్ కు ఎదురులేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
*తమకు అండగా నిలిచిన వారికే పట్టం..
ఏదేమైనా వరంగల్ ప్రజలకు అన్నీ తెలుసు. సమైక్యరాష్ట్రంలో అప్పటి పాలకులను ఎదురించి ఉద్యమంలో ముందుండి పోరాడిన చరిత్ర వీరిది. ఉద్యమం పతాకస్థాయికి చేరిన రోజుల్లో జగన్ టూర్ ను నిలువరించిన ఘన చరిత్ర కూడా ఓరుగల్లుదే. కాబట్టి ఏ పార్టీ ఏం చెప్పినా, ప్రజలు మాత్రం తాము అనుకున్నదే చేస్తారు. తమకు అండగా నిలిచే పార్టీకే ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి గులాబీ కంచుకోటలో ఇతర పార్టీలకు స్థానం గగమేనన్న మాట అయితే బలంగా వినిపిస్తోంది. ఒకటి రెండు సీట్లు మినహాయిస్తే అన్నిచోట్లా మరోసారి కారు జెట్ స్పీడ్ తో దూసుకుపోవడం ఖాయమని విశ్లేషకులు కూడా స్పష్టం చేస్తున్నారు.