తుమ్మలకు మళ్లీ మొండిచేయి !
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : అలిగి ఇంటి నుంచి వెళ్లిపోతున్న కుటుంబసభ్యుడిని సర్దిచెప్పి మరీ తీసుకొచ్చిన తర్వాత అతనికి ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఎలా ఉంటుందో తుమ్మల నాగేశ్వర్ రావు పరిస్థితి అలాగే ఉంది. ఇటీవల ఖమ్మం బీఆర్ఎస్ మీటింగ్ కు ముందు మంత్రి హరీశ్ రావు స్వయంగా తుమ్మల ఇంటికి వెళ్లి నచ్చజెప్పారు. కేసీఆర్ పట్ల అసంతృప్తిగా ఉన్న ఆయనను బుజ్జగించారు. దాంతో ఖమ్మం బీఆర్ఎస్ మీటింగ్ సక్సెస్ కావడంతో తుమ్మల తన వంతు పాత్ర పోషించారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ తుమ్మల మరోసారి తెరమరుగయ్యారు. ఎమ్మెల్సీ సీటు ఆశించినప్పటికీ తుమ్మలకు మరోసారి నిరాశే మిగిలిందని ఆయన అనుచరులు ఫుల్ గుస్సాగా ఉన్నారని టాక్. తాజాగా ప్రకటించిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ లిస్టులో తుమ్మల పేరు లేకపోవడం పెద్ద చర్చకు దారితీసింది.
* గతంలో ఓ వెలుగు వెలిగిన తుమ్మల !
తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు తుమ్మల నాగేశ్వర్ రావు. చంద్రబాబు హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆయన 2014 నాటికి ఫేడ్ ఔట్ అయిపోయారు. కానీ సీఎం కేసీఆర్ అలాంటి తుమ్మలను ఇంటికెళ్లి మరీ టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీలోకి తీసుకున్నారు. తుమ్మల మంత్రి అయిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ బాగా బలపడిందని ఒప్పుకుని తీరాల్సిందే. ఆ తర్వాత వచ్చిన పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగి సత్తా చాటారు తుమ్మల. దాంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా తుమ్మల హవా కొనసాగింది. కానీ 2018కి వచ్చే సరికి ఏం జరిగిందో తెలియదు కానీ అదే పాలేరులో తుమ్మలకు ఎదురుగాలి వీచింది. ఆయన పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత క్రమంగా తెరమరుగైపోయారు.
* అవసరం మేరకే తుమ్మలకు హామీ ఇచ్చారా !
ఖమ్మంలో గులాబీగూటికి చుక్కానిగా నిలిచిన తుమ్మలకు ప్రాధాన్యం తగ్గింది. టీఆర్ఎస్ మీటింగ్స్ లో హడావుడి చేసే తుమ్మల కనిపించకుండా పోయారు. నాలుగేళ్లు అలాగే గడిచిపోయింది. ఈ దశలో ఆయన పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అప్పుడే రాజకీయం మారింది. టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారింది. ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ మీటింగ్ ను తలపెట్టారు సీఎం కేసీఆర్. ఖమ్మంలో బీఆర్ఎస్ మీటింగ్ సక్సెస్ కావాలంటే తుమ్మల ప్రాధాన్యత ఏంటో గుర్తించారు సీఎం కేసీఆర్. అందుకే హరీశ్ రావు ఎంట్రీ ఇచ్చి తుమ్మలను ఖమ్మం మీటింగ్ కు తీసుకొచ్చారని చెబుతుంటారు. అంతేకాదు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి మరీ ఆయనను ఒప్పించారని కూడా టాక్.* ఊరించి ఉసూరుమనిపించిన గులాబీదళం !
తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీలో ఒకసీటు తుమ్మలకు ఖాయమని ప్రచారం జరిగింది. కానీ మళ్లీ ఏం జరిగిందో తెలియదు కానీ తుమ్మల పేరు ఆ లిస్టు నుంచి మిస్ అయిపోయింది. దీంతో తుమ్మల వర్గం బీఆర్ఎస్ పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉందని టాక్. గులాబీ పెద్దలు ఊరించి మరీ ఉసూరుమనిపించారని ఆయన వర్గీయులు గుసగుసలాడుకుంటున్నారట. అంతే కాదు ఈ విషయాన్ని గ్రహించి ఇతర పార్టీలు అప్పుడే తుమ్మలకు గాలం వేసే పనిలో పడ్డాయని చెప్పుకుంటున్నారు.
* తుమ్మల పార్టీ మారడం ఖాయమేనా?
అనుకున్నది దక్కకపోవడంతో తుమ్మల కూడా పార్టీ మారేందుకు మొగ్గు చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. అన్నీ కుదిరితే కాంగ్రెస్ వైపే ఆయన మొగ్గు చూపవచ్చన్న వాదన వినిపిస్తోంది. ఇక బీజేపీ కూడా ఆయనను చేర్చుకునేందుకు సంప్రదింపులు జరుపుతోందన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే కొంతమంది బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తొందరపడవద్దని తుమ్మలకు సూచిస్తున్నారట. ఎన్నికలకు ముందు అలాంటి ఆలోచనలు చేయవద్దని సూచిస్తున్నట్లు సమాచారం.
అసలే ఖమ్మంలో పలు పార్టీలు బీఆర్ఎస్ తో తొడగొడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్టీపీ చివరకు బీఎస్పీ కూడా ఖమ్మంలో గులాబీదళాన్ని నిలువరిస్తామని చెబుతున్నాయి. ఈ తరుణంలో తుమ్మల ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ లోనే ఉంటారా? లేక వేరే దారి చూసుకుంటారా? అన్నీ కాదని రాజకీయాలకే గుడ్ బై చెబుతారా? అన్నది త్వరలోనే తేలిపోనుంది.