సొంత పార్టీ దిశగా పొంగులేటి ? 

సొంత పార్టీ దిశగా పొంగులేటి ?

సొంత పార్టీ దిశగా పొంగులేటి ? 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మనసు మారిందా? బీజేపీలో చేరేందుకు ఆయన విముఖత చూపుతున్నారా? కాంగ్రెస్ లోకి వెళ్లే ఉద్దేశ్యం లేదా? వైస్సాఆర్టీపీ అంటే నో అంటున్నారా? లేక ఇవన్నీ కాదని కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారా? పొంగులేటి రాజకీయ గమనం ఎటువైపు?

* బీజేపీలోకి వెళ్లేందుకు విముఖత ?
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారు దిగేందుకు సిద్ధమయ్యారు కానీ ఆయన గమనం ఎటు వైపు అన్నది క్లారిటీ లేదు. గులాబీగూటి నుంచి ఆయన ఎటు వైపు వెళ్తారోనన్నది అంతుచిక్కడం లేదు. చివరకు ఆయన సన్నిహితులు కూడా పొంగులేటి గురించి చెప్పలేకపోతున్నారు. కొంతకాలం కింద వరకు ఆయన బీజేపీలోకి వెళ్తారని గట్టిగా ప్రచారం జరిగింది. అమిత్ షా సమక్షంలో కాషాయం కండువా వేసుకుంటారని బీజేపీ శ్రేణులు గుసగుసలాడుకున్నారు. ఇక బీజేపీలో ఆయన చేరిక లాంఛనమేనని అనుకుంటున్న తరుణంలో సడెన్ గా కొత్త వార్త తెరపైకి వచ్చింది. పొంగులేటి మనసు మారిందని, ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా లేరన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

నిజానికి కారు దిగేందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిద్ధం అని తెలియగానే ప్రతిపక్షాల్లోని పలు పార్టీల నుంచి ఆయన ఆహ్వానాలు అందాయట. బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్టీపీ, తెలుగుదేశం, బీఎస్పీ, చివరకు కామ్రేడ్లు కూడా పొంగులేటికి ఇన్విటేషన్ పంపించినట్లు టాక్. కానీ పొంగులేటి మాత్రం దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు మొగ్గుచూపారట. అంతేకాదు ఆయన చేరికకు ముహూర్తం కూడా కుదరిందని, అమిత్ షా సమక్షంలో జాయినింగ్ ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ సడెన్ గా ఎందుకో పొంగులేటి అటువైపు వెళ్లేందుకు సిద్ధంగా లేరని టాక్.

* బీజేపీకి ఓటుబ్యాంకు లేకపోవడంతో వెనుకడుగు !
జాతీయపార్టీ, అది కూడా అధికారంలో ఉన్న పార్టీ అయిన బీజేపీలోకి వెళ్లడానికి పొంగులేటి ఎందుకు తటపటాయిస్తున్నారన్న దానిపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రధానంగా ఖమ్మంలో బీజేపీకి అంత ఓటు బ్యాంకు లేనందుకే పొంగులేటి వెనుకడుగు వేస్తున్నట్లు టాక్. ఎర్రపార్టీలు, కాంగ్రెస్ కు కంచుకోట అయిన ఖమ్మంలో కాషాయం పార్టీకి అంత సానుకూల వాతావరణం ఉండదని పొంగులేటి భావిస్తున్నారట. అంతేకాదు ఇటీవల ఆయన ఓ సర్వే చేయించుకున్నట్లు టాక్. బీజేపీకి వెళ్తే తనకు అంత కలసి రాదని ఈ సర్వేలో తేలిందట. అలాగే తనతో పాటు తన అనుచరులకు కూడా బీజేపీ కలిసి రాదని తేలినట్లు సమాచారం. అందుకే పొంగులేటి చివరిక్షణంలో మనసు మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

* అనుచరులను గెలిపించుకునేందుకు స్కెచ్ !
ఆ పార్టీ, ఈ పార్టీ కంటే సొంత రాజకీయ పార్టీ అయితేనే బెటర్ అనే భావనలో పొంగులేటి ఉన్నారట. కొత్త రాజకీయ పార్టీ అయితే ఫ్రెష్ లుక్ ఉంటుంది. తనతో పాటు తన అనుచరులందరికీ కావలసిన చోట టికెట్ ఇచ్చే అవకాశముంది. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పొంగులేటికి సన్నిహితులున్నారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లోనూ తనకు కావలసిన వాళ్లకు టికెట్లు ఇచ్చి సత్తా చాటాలని పొంగులేటి భావిస్తున్నారట. సొంత పార్టీపై సర్వే కూడా చేయించుకున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ కంటే సొంత పార్టీయే బెటర్ అని ఆ సర్వేలో తేలినట్లు టాక్. తనతో పాటు మరో ఇద్దరు, ముగ్గురు గెలిచినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని పొంగులేటి భావిస్తున్నారట. అప్పుడు ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమకంటూ ఐడెంటిటీ ఉంటుందని పొంగులేటి వర్గం కూడా భావిస్తున్నట్లు టాక్. అన్నింటికంటే ముఖ్యంగా తమకు నచ్చిన పార్టీకి సపోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. బీజేపీ పెద్దలతో ఈ విషయాలన్నీ పొంగులేటి పంచుకున్నట్లు సమాచారం. ఈ పరిణామాలన్నీ అంచనా వేసుకునే పొంగులేటి సొంత పార్టీ దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది.

* గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న పొంగులేటి !
ఇప్పట్నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పక్కా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన వరుసగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలు కూడా ఆ ప్లాన్ లో భాగమేనట. ఎవరికి ఎంత బలముంది. అన్న అంచనాలు వేసుకునేందుకే ఈ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా సొంత పార్టీ పెట్టి, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పొంగులేటి సర్వం సిద్ధం చేసుకుంటున్నట్టు టాక్. మరి పొంగులేటి ప్లాన్ వర్కవుట్ అవుతుందా ఆయన ఎంత వరకు సక్సెస్ అవుతారన్నది కాలమే నిర్ణయించాలి.