డిసెంబరు 3 నుంచి 5 వరకు భారీ వర్షాలు

డిసెంబరు 3 నుంచి 5 వరకు భారీ వర్షాలుఒరిస్సా (గోపాలపూర్‌) : దక్షిణ అండమాన్‌ సాగరంలో రేపు (30న) అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత 48 గంటల్లో వాయుగుండంగా మారి పశ్చిమ-ఉత్తర పశ్చిమ దిశగా కదులుతుందని, కేంద్ర బంగాళాఖాతం మీదుగా ఆంధ్రప్రదేశ్‌-ఒడిశాల మధ్య తీరానికి చేరువయ్యే సూచనలున్నాయని గోపాలపూర్‌ డాప్లార్‌ రాడార్‌ కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌దాస్‌ ఆదివారం ఒక పత్రిక కు చెప్పారు.

వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందని, ఒడిశాపై డిసెంబరు 2 నుంచి ప్రభావం చూపనుందని, 3 నుంచి 5 వరకు భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించారు.

ఏ ప్రాంతంలో అతిభారీ వానలు కురుస్తాయన్నదానిపై అధ్యయనం జరుగుతోందని చెప్పారు. ఈ విపత్తు మూలంగా అన్నదాతులు, మత్స్యకారులు ప్రభావితమయ్యే పరిస్థితి ఉన్నందున ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నామన్నారు. కోతకొచ్చిన, కోసిన వరి, కూరగాయల పంటల సంరక్షణ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ నెల 30 నుంచి సాగరం లోపల గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, డిసెంబరు 2 నుంచి 5 వరకు బంగాళాఖాతం వెంబడి తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత ఉంటుందన్న అంచనాతో మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నట్లు దాస్‌ స్పష్టం చేశారు.