మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో భారీ తనిఖీలు

మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో భారీ తనిఖీలుభూపాలపల్లి జయశంకర్ జిల్లా : మావోయిస్టు పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ములుగు ఎస్పీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్​చార్జి ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ గారు గురువారం వాహన తనిఖీలు చేపట్టారు. మావోయిస్టుల అలజడి నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, రాత్రింబవళ్లు తేడా లేకుండా తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైల నుండి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చే స్తూ, తగు సూచనలు ఇస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్​గడ్​ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఎస్పీ భద్రతా పరమైన ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా లో మావోల అసాంఘిక కార్యకలపాలకు తావివ్వకుండా ముందస్తుగా పోలీస్ బలగాలు పహారా కాస్తున్నాయి. తెలంగాణ- మహరాష్ట్రాలనుంచి కాళేశ్వరం అంతర్రాష్ట్ర బ్రిడ్జ్ మీదుగా రాకపోకలను సాగిస్తున్న వాహనలను ఎస్పీ నిలిపి, అనుమానితులను ప్రశ్నించారు. అనంతరం కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ను అకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ, మహరాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ, కూంబింగ్ లో పాల్గొంటున్నారు. గ్రామాల్లో అసాంఘిక శక్తులకు ఆశ్రయం కల్పించినా సహాయం చేసిన వ్యక్తులపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ హెచ్చరించారు. మావోయిస్టులు అడవులను వదిలి ,జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవితాన్ని పొందాలన్నారు. ,ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు, జీవనోపాధి కల్పన సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని, కోరారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ బోనాల కిషన్, మహాదేవ్ పూర్ సీఐ నరసయ్య, కాళేశ్వరం ఎస్సై నరహరి ఉన్నారు