ముగిసిన మెడికో ప్రీతి అంత్యక్రియలు
వరంగల్ టైమ్స్, జనగామ జిల్లా : సీనియర్ల వేధింపులతో బలవన్మరణానికి పాల్పడి గత 5 రోజులుగా మృత్యువుతో పోరాడిన మెడికో ప్రీతి అంత్యక్రియలు తన స్వగ్రామం మొండ్రాయి గిర్ని తండాలో ముగిశాయి. ప్రీతి మరణంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు విలపిస్తున్నారు. అంతేకాక గిర్ని తండా అంతా కూడా ఈ రోజు శోకసంద్రంలా మారిపోయింది.
వరంగల్ కేఎంసీలో పీజీ అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి ఫిబ్రవరి 22న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఆమెకు మొదట వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు. ఆరోగ్యం విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. మొదట వెంటిలేటర్ పై, ఆ తర్వాత ఎక్మోపై చికిత్స అందించారు. ఐదు రోజులు మృత్యువుతో పోరాడిన ప్రీతి చివరికి ఈ లోకాన్ని వీడింది.