ఢిల్లీలో దీక్ష ఏర్పాట్లను పరిశీలించిన కవిత
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇప్పటికే రైతుల ఆందోళనలతో కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతున్నదని కవిత విమర్శించారు. ఈనెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ దీక్ష ఏర్పాట్లను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీలు సురేశ్ రెడ్డి, బీబీ పాటిల్ , ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో కలిసి ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల మద్దతు కలిసి తెలంగాణ హరిత ప్రదేశంగా మారిందని కవిత పేర్కొన్నారు.రాష్ట్రంలో పంటల దిగుబడి రెండు రెట్లు పెరిగిందన్నారు. తెలంగాణలో పండిన ప్రతీ ధాన్యపు గింజను కేంద్రం కొనాల్సిందేనని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులు ఢిల్లీ రోడ్లపై ఆందోళనకు సిద్ధమయ్యారని చెప్పారు. ధాన్యం సేకరణపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. జాతీయ స్థాయిలో సమగ్ర ధాన్యం సేకరణ విధానం కొనసాగాలన్నారు.