హైదరాబాద్ ను దెబ్బతీసేందుకు మోడీ కుట్ర: బోయినపల్లి

హైదరాబాద్ ను దెబ్బతీసేందుకు మోడీ కుట్ర: బోయినపల్లివరంగల్ టైమ్స్, హైదరాబాద్‌ : హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సహకారంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తే, హైదరాబాద్ కు ఎక్కడ పేరు వస్తుందోనని కేంద్రం కుట్ర చేస్తుందని మండిపడ్డారు.

సింగపూర్, హాంకాంగ్, జెనీవా తర్వాత అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ హైదరాబాద్ లో ఏర్పాటుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తే.. దీన్ని దెబ్బ తీసేందుకు ప్రధాని మోడీ నిన్నటి బడ్జెట్ సమావేశాల్లో హైదరాబాద్ ప్రస్తావన లేకుండా మరో ఆర్బిట్రేషన్ సెంటర్ ను గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులకు దమ్ము ఉంటే గుజరాత్ ప్రతిపాదనలను విరమింపచేసి హైదరాబాద్ ప్రతిష్టను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

హైదరాబాద్ ప్రజలారా..! బీజేపీని నమ్మకండి.. హైదరాబాద్ గౌరవాన్ని కాపాడుకునేందుకు కలిసి రావాలని, వాస్తవాలు గ్రహించాలని ఆయన హైదరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. గవర్నర్లు వారి పరిధిలో పని చేసుకోవాలని ఆయన సూచించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పై అక్కడి గవర్నర్ ట్విట్టర్ లో కామెంట్ చేయడం ఏమిటని వినోద్ కుమార్ ప్రశ్నించారు. బీజేపీ ఉత్తర భారత పార్టీ అని వినోద్ కుమార్ అన్నారు. బీజేపీ కి రాష్ట్రంలో నాయకులు ఉన్నారు కానీ వీళ్లకు జాతీయ బీజేపీ నాయకులు ఎవరూ పట్టించుకోరని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయింపులు జరిపిందని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ని ఇరిగేషన్ ప్రాజెక్టు లకు జాతీయ హోదా కల్పిస్తూ రూ. 49 వేల కోట్లు బడ్జెట్ లో ప్రకటించారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా నదీ జలాల విషయంలో పలు వివాదాలను పరిష్కరించకుండా కేంద్ర జల్ శక్తి మంత్రి నదుల అనుసంధానం చేస్తామని ఎలా చెబుతారని, నదుల అనుసంధానం ఒక బక్వాష్ ముచ్చట అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ బండ ప్రకాష్ కూడా పాల్గొన్నారు.