తెలంగాణపై మోడీ విషం చిమ్మాడు: హరీశ్ రావు

తెలంగాణపై మోడీ విషం చిమ్మాడు: హరీశ్ రావువరంగల్ టైమ్స్,హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు పై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రధాని మోడీకి కౌంటర్ వేశారు. రాజ్యసభలో మోడీ మాటలు తెలంగాణ ప్రజల మనసులను గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణపై ఆయనకున్న అక్కసును వెళ్లగక్కిండన్నారు. తెలంగాణపై ఎందుకు ఇంత కక్ష, ఎందుకు విషం చిమ్ముతున్నారని ప్రశ్నించారు.

అన్ని రంగాల్లో తెలంగాణ ముందుకు వెళుతుంటే మోడీ మాత్రం ద్వేషం పెంచుకున్నాడని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా ఉండి, రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని విమర్శించారు. ఏడు మండలాలను ఆంధ్రలో కలిపి విద్యుత్ ప్లాంటును కూడా ఆంధ్రకు అప్పగించిన మోడీ, తెలంగాణపై ఎంత వివక్షత చూపించారో అర్ధం అవుతుందన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన రూ.900 కోట్లు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

రాష్ట్రానికి రూ.5000 కోట్లు రావాలంటే విద్యుత్ సంస్కరణలు అమలు చేయాలని బడ్జెట్ లో షరతు పెట్టారని గుర్తు చేశారు. అంటే వ్యవసాయ బావిల దగ్గర మీటర్లు పెట్టాలి, ముక్కు పిండి పైసలు వసూలు చేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నితే, కేసీఆర్ మాత్రం నా గొంతులో ప్రాణం ఉండగా బావిల దగ్గర మీటర్లు పెట్ట, రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారని హరీష్ రావు తెలిపాడు.

కేంద్రప్రభుత్వం డీజిల్ ధరలు పెంచింది, ఎరువుల ధరలు పెంచింది. యూపీ ఎన్నికలు అయిపోగానే మళ్లీ డీజిల్ , పెట్రోల్ ధరల భారం మళ్లీ తప్పదు. దళిత బంధు దేశానికి ఆదర్శం, రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తాం అని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుంటే, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ, తెలంగాణ ప్రజల మనసులను గాయపరిచే విధంగా మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.