జూన్‌ 8న తెలంగాణకు నైరుతి

జూన్‌ 8న తెలంగాణకు నైరుతి

*కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం
*మే 17 దాకా తేలిక పాటి వర్షాలు
*హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి

వరంగల్ టైమ్స్, హైదరాబాద్‌ : నైరుతి రుతుపవనాలు జూన్‌ 8న తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఐదు రోజులు ముందుగానే కేరళను తాకనున్నాయని తెలిపారు. సాధారణంగా నైరుతి పవనాలు జూన్‌ 1న కేరళలో ప్రవేశిస్తాయి. క్రమంగా దేశమంతటికీ విస్తరిస్తాయి. అయితే, ఈసారి ఈ నెల 27నే కేరళను తాకనున్నట్టు నాగరత్న వెల్లడించారు. అండమాన్‌ దీవుల్లో ఈ నెల 15 నుంచే వర్షాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. జూన్‌ 8న తెలంగాణకు నైరుతిరాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైన నమోదవుతున్నాయి. శుక్రవారం 22 జిల్లాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఎండ కొట్టింది. అత్యధికంగా కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌లో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, ఈ నెలలో ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని నాగరత్న తెలిపారు. అయితే, వడగాలులు వచ్చే అవకాశాలు లేవన్నారు. 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. అసని తుఫాను కారణంగానే నైరుతి ముందుగా వస్తున్నదని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

*బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 17 వరకు తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. శనివారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.