ఖమ్మం పట్టణంలో విషాదం

ఖమ్మం పట్టణంలో విషాదంఖమ్మం జిల్లా : ఖమ్మం పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కూతురు వివాహానికి డబ్బులు సమకూరలేదన్న మనస్తాపంతో తల్లీ, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గోపాలపురం ప్రకాశ్​, గోవిందమ్మ దంపతులు పట్టణంలోని గాంధీచౌక్​లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు రాధిక, రమ్య ఉన్నారు. ప్రకాశ్​ మహబూబాబాద్​లో బంగారం మెరుగు పెట్టే పనిచేస్తున్నాడు. ఇటీవలే ప్రకాశ్​ పెద్ద కూతురు రాధికకు జనగామ జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం చేయడానికి నిశ్చయించారు. వచ్చే నెల జనవరి 11న వారి విహానికి ముహూర్తం కూడా పెట్టారు. అయితే అప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి వివాహానికి డబ్బులు సర్ధబాటు కాలేదు. దీంతో మనస్తాపానికి గురైన తల్లీ , ఇద్దరు కూతుళ్లు నిన్న రాత్రి తమ ఇంట్లో ఉన్న బంగారం మెరుగుపరిచేందుకు ఉపయోగించే రసాయనాన్ని తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో పనికి వెళ్లి వచ్చిన ప్రకాశ్​ రాత్రి పది గంటలకు తలుపు తట్టాడు. వారు ఎంతకు లేవకపోవడంతో ఇరుగు పొరుగు వారిని పిలిచారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగులకొట్టి చూడగా ముగ్గురూ మృతిచెంది ఉన్నారు. దీంతో మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆత్మహత్యకు గల కారణలు దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్​మార్టం నివేదిక వస్తే ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు.