ఎంపీ అరవింద్ వాహనంపై రాళ్ల దాడి

ఎంపీ అరవింద్ వాహనంపై రాళ్ల దాడినిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండలం ఇస్సపల్లిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వాహనం పై టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాళ్లతో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో ఎంపీ అరవింద్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. నందిపేట్ మండలం నూత్ పల్లిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ధర్మపురి అరవింద్ వెళ్తుండగా, ఆర్మూర్ మండలం ఇస్సపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో అరవింద్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

దీంతో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు ఘర్షణకు దిగాయి. ఇరువర్గాల ఘర్షణతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అయితే పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆర్మూర్ లో బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ దాడిలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు : ఎంపీ ధర్మపురి
నందిపేట్ మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వెళ్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారని ధర్మపురి అరవింద్ తెలిపారు. సుమారు 200 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తమకు అడ్డు తగిలి, రోడ్డుకు అడ్డంగా టైర్లు కాల్చి వేశారని ఆరోపించారు. ఈ విషయంపై సీపీ, ఏసీపీ లతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు ప్రేక్షకపాత్ర వహించారని మండిపడ్డారు. పోలీసులే దగ్గరుండి తమ వాహనాలపై దాడి చేయించారని అరవింద్ ఆరోపించారు.

పోలీసులు టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తాము పదేపదే చెబుతున్న మాటలు మరోసారి రుజువైందన్నారు. ఈ ఘటనపై లోక్ సభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు. తమ పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ తెలిపారు. మరోవైపు టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారని ఆరోపిస్తూ పోలీస్ కమిషనర్ కు ధర్మపురి అరవింద్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని ఆయన సీపీ ని కోరారు.
………………………..