ఏలూరులో వాటి ప్రభావం లేదు

ఏలూరులో వాటి ప్రభావం లేదుపశ్చిమగోదావరి జిల్లా: ఏలూరులో తాగునీరు సురక్షితంగా ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. తాగునీటి శాంపిల్స్ లో ప్రమాదకరమైనవి లేవని స్పష్టం చేశారు. 16 తాగునీటి శాంపిల్స్ ను పరిశీలించగా ఒక శాంపిల్ లో మాత్రమే లెడ్ మోతాడు ఎక్కువగా వుందని వైద్యులు తెలిపారు. ఏలూరు ప్రజల అస్వస్థత కేసులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర వైద్య బృందాలు, నిపుణులు అధికారులతో మాట్లాడారు. కేంద్ర బృందాల నివేదికలోని విషయాలను సీఎంకు నిపుణులు వివరించారు. గాలి, నీటిలో లెడ్ , నికెల్ ఎక్కువ మోతాదులో లేవని ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ వెల్లడించారు.ఆహార పదార్ధాల్లో మెర్క్యురీ ఉన్నట్లు తేలిందన్నారు. నీటిలో ఎలాంటి బ్యాక్టీరియా లేదని ఎయిమ్స్ నివేదిక ఇచ్చిందన్నారు. తాగునీటిలో ఆర్గానో క్లోరిన్ ఎక్కడా కనిపించలేదని పేర్కొన్నారు. నీటి కాలుష్యంపై నాగపూర్ ఒపినియన్ తీసుకుంటామని అన్నారు. రక్త నమానాలకు సంబంధించి సీసీఎంబీ క్లియర్ రిపోర్ట్ వచ్చింది. ఆహారం, కూరగాయల్లో కొంత పెస్టిసైడ్స్ కనిపించాయని , నీటి గురించి అపోహ పడొద్దని తెలిపారు. అన్ని మెడికల్ క్యాంపులు కొనసాగుతున్నాయని అన్నారు. ఎయిమ్స్ రెండో సారి ఇచ్చిన రిపోర్టులోనూ బాధితుల్లో సీసం ఎక్కువగా ఉన్నట్లు వచ్చిందిని , ఈ రోగానికి ఎటువంటి పేరు పెట్టలేదని తెలిపారు. బాధితుల రియాక్షన్ వల్ల వస్తున్న లక్షణాలుగానే భావిస్తున్నామని తెలిపారు. దీనిపై కొన్ని సంస్థలు ఇంకా పూర్త స్థాయి నివేదికలు ఇవ్వలేదని కాటమనేని భాస్కర్ పేర్కొన్నారు.