ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు : చిరు

ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు : చిరుతాడేపల్లి : ఏపీ సీఎం వైఎస్ జగన్ తో సమావేశం ముగిసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమకు ఎంతో ధైర్యాన్నిచ్చే విధంగా సీఎం మాట్లాడారని చిరంజీవి తెలిపారు. ఈ నేపథ్యంలో పెద్దగా కాదు, ఒక బిడ్డగా చెప్తున్నాను అందరూ సంయమనం పాటించాలి, ఎవరు పడితే వారు మాట్లాడి నోరు జారొద్దు. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయని మెగాస్టార్ స్పష్టం చేశారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపై గంటన్నర పాటు చర్చించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరలపై జగన్ తో చర్చించారు. ఆ సమస్యను పరిష్కరించాలని చిరంజీవి సీఎంను కోరారు.

హైదరాబాద్ కు తిరుగుప్రయాణం సందర్భంగా గన్నవరం ఎయిర్ పోర్టులో చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ తో జరిగిన భేటీ చాలా సంతృప్తికరంగా సాగిందన్నారు. ఈ పండుగ పూట సీఎం జగన్ తనను ఆహ్వానించడం, ఆత్మీయత కనబరచడం అత్యంత సంతృప్తినిచ్చిందన్నారు. ఆప్యాయత కనబరిచిన జగన్ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు.

గత కొన్ని నెలలుగా సినీ ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. ఏం జరుగుతుంది అనే అసంతృప్తి ఉంది. ఇండస్ట్రీకి, ప్రభుత్వానకి మధ్య కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ప్రత్యేకించి జగన్ తనను ఆహ్వానించినట్లు తెలిపారు. తాను చేసిన ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకుని, విధివిధానాలను చర్చించారు. సామాన్య ప్రజలకు అందుబాటులో వినోదం అనేది అందుబాటులో ఉండాలన్న ప్రయత్నాన్ని గౌరవిస్తానన్నారు.

సినీ పరిశ్రమలో ఉన్న సాదకబాధకాలను కూడా సీఎం కు వివరించినట్లు పేర్కొన్నారు. దీనిపై సీఎ జగన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కమిటీ ఏర్పాటు చేసి అంతరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పినట్లు చిరంజీవి పేర్కొన్నారు. జగన్ మాటలు విన్నాక ఎనలేని ధైర్యం వచ్చిందన్నారు చిరంజీవి. త్వరలోనే తనతో సమావేశమై అన్ని నిర్ణయాలను ప్రకటిస్తామని, అనంతరం జీఓ విడుదల చేస్తామని జగన్ చెప్పినట్లు చిరంజీవి వెల్లడించారు.

వారం, పదిరోజుల్లో సినీ పరిశ్రమకు అనుకూలమైన జీఓ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అని చిరంజీవి అన్నారు. ఐదో షో నిర్వహణపై కూడా జగన్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశం ఎంతో ఫలవంతంగా జరిగిందన్నారు. త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి, అందరి సలహాలు, సూచనలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని చిరంజీవి పేర్కొన్నారు.