తెలంగాణ పట్ల ఆగని మోడీ వివక్ష: మంత్రి కేటీఆర్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర సర్కార్, తెలంగాణ పట్ల వివక్షత చూపిస్తూనే ఉందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో గుజరాత్ లోని జామ్ నగర్ లో సంప్రదాయ వైద్య కేంద్రాన్ని ప్రారంభించడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. సంప్రదాయ వైద్య కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తారని గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఆ ప్రతిష్టాత్మక జాతీయ కేంద్రాన్ని రాష్ట్రానికి తీసుకురావడంలో విఫలమైనట్లు కేటీఆర్ విమర్శించారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నేడు తన ట్విట్టర్ లో స్పందించారు.గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషినల్ మెడిసిన్ కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని ఆయుష్ మంత్రిత్వశాఖ భావిస్తోందని, ఈ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం వల్ల, అది నగరాన్ని, రాష్ట్రాన్ని బలోపేతం చేస్తుందని గతంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన ట్వీట్ ద్వారా పేర్కొన్నట్లు కేటీఆర్ తెలిపారు. ఐతే ఇప్పుడు ఆ సెంటర్ జామ్ నగర్ కు వెళ్లడంతో కిషన్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. సంప్రదాయ వైద్య కేంద్రాన్ని మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి తీసుకువచ్చినందుకు థ్యాంక్స్ చెబుతున్నట్లే చెప్పిన మంత్రి కేటీఆర్, కాస్త ఆగండి..గుజరాత్ ప్రధాని ఆ కేంద్రాన్ని జామ్ నగర్ కు తీసుకువెళ్లినట్లు తన ట్వీట్ లో కేటీఆర్ ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రంపై ప్రధాని మోడీ వివక్షత ఓ ధారావాహికంలా సాగుతోందని, తెలంగాణకు నిత్యం అన్యాయం జరుగుతున్నట్లు కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు మంజూరి చేసిన జాతీయ ఇన్స్ టిట్యూట్ల వివరాలను కూడా కేటీఆర్ తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఐఐఎం, ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీ, ఎన్ఐడీ, మెడికల్ కాలేజీలు, నవోదయ స్కూళ్లను ఇతర రాష్ట్రాలకు మంజూరి చేశారని, కానీ తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ తన ట్వీట్ లో తెలిపారు. రాష్ట్ర పునర్ విభజన చట్టంలో హామీ ఇచ్చిన గిరిజన వర్సిటీని ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. దానికి సంబంధించిన డేటాను కూడా ఆయన ప్రజెంట్ చేశారు.