హైదరాబాద్ శివార్లలో మరొక అర్బన్ ఫారెస్ట్ పార్క్

మలక్ పేట్: హైదరాబాద్ వాసులకు శివార్లలో మరొక అర్బన్ ఫారెస్ట్ పార్క్ అందుబాటులోకి వచ్చింది. కరీంనగర్ హైవే పై శామీర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో లాల్ గడి మలక్ పేట్ లో ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను అభివృద్ది చేసింది.హైదరాబాద్ శివార్లలో మరొక అర్బన్ ఫారెస్ట్ పార్క్ఈ అటవీ ప్రాంతం కొండ గొర్రెకి (chowsingha) ప్రసిద్ధి కావటంతో అర్బన్ పార్క్ కి కొండ గొర్రె వైల్డర్ నెస్ పార్క్ గా పేరు పెట్టాలని నిర్ణయించారు. ఇక్కడ అభివృద్ది చేసిన ఐదు కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, 25 కిలో మీటర్ల సైక్లింగ్ ట్రాక్ ను అటవీ అభివృద్ది సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీ. రఘవీర్ ప్రారంభించారు. లాల్ గడీ మలక్ పేట అటవీ ప్రాంతం 2, 635 ఎకరాల్లో విస్తరించి ఉంది, దీనిలో కొద్ది ప్రాంతంలో అర్బన్ ఫారెస్ట్ పార్కును అభివృద్ది చేసి, మిగతా అటవీ ప్రాంతానికి మొత్తం ఫెన్సింగ్ వేయటంతో పాటు, పునరుద్దరణ పనులు చేపట్టారు.

కొంత మేర క్షీణించిన అటవీ ప్రాంత పునరుద్దరణ కోసం దశల వారీగా ఇప్పటికే పదివేల మొక్కలను నాటి సంరక్షిస్తున్నట్లు రఘవీర్ తెలిపారు. హైదరాబాద్ తో పాటు, ఔటర్ సమీపంలో కాలనీల వాసులకు పర్యావరణహితంగా ఉంటే ఈ అర్బన్ ఫారెస్ట్ పార్కును పూర్తి హంగులతో అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. సహజ అటవీ ప్రాంతం దెబ్బతినకుండా, సందర్శకులకు అహ్లాదాన్ని పంచేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దశల వారీగా నేచర్ ట్రయల్స్, నేచర్ ఫోటోగ్రఫీ పాయింట్స్, గ్రీన్ కేఫే, క్యాంపింగ్ సైట్స్ అభివృద్ది చేసే ప్రణాళికలు ఉన్నాయన్నారు.

ఈ నెలాఖరుకు పదవీ విరమణ పొందుతున్న ఫారెస్ట్ కార్పోరేషన్ ఎం.డీ, పీ.రఘువీర్ ను ఉద్యోగులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు ఈ సందర్భంగా సన్మానించారు. ట్రాక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రఘవీర్ తో పాటు ఫారెస్ట్ కార్పోరేషన్ జనరల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఆనంద్ మోహన్, రిటైర్డ్ ఐ.ఎఫ్.ఎస్, మేడ్చల్ జిల్లా అటవీ అధికారి సుధాకర్ రెడ్డి, డివిజనల్ మేనేజర్ శిరీష, చిత్రాక్ ఎకో వెంచర్స్ ప్రతినిధులు, వివిధ పర్యావరణహిత సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.