ప్రజా కళాకారుడు నిసార్ మృతి

హైదరాబాద్‌: ప్రముఖ ప్రజా కళాకారులు, ప్రజా నాట్య మండలి రాష్ట్ర బాధ్యుడు నిసార్(56) ఇవ్వాళ తెల్లవారు ఝామున మృతి చెందారు. గత రెండు రోజులుగా కరోనాతో బాధపడుతున్న నిసార్ ఆరోగ్య పరిస్థితి నిన్న క్షీణించిపోవడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణం కోల్పోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం సుద్దాల గ్రామానికి చెందిన నిసార్ ప్రజా రచయిత, గాయకులుగా ప్రజల్లో గొప్ప పేరు సంపాదించారు. ప్రజా కళాకారుడు నిసార్ మృతితెలంగాణ ఉద్యమంలో ఆయన రచించిన పాటలు ఎంతో ఆదరణ పొందాయి. ఎన్నో సభల్లో ఆయన గొంతువిప్పి ప్రజలకు ఉద్యమ చైతన్యాన్ని అందించారు. గచ్చిబౌలి ఆర్టీసీ డిపోలో ఆయన కండక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. నిసార్ మృతిపట్ల ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యుజె అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీలు ప్రఘాడ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తమ యూనియన్ నిర్వహించిన పలు సభల్లో నిసార్ తన ఆటపాటలతో జర్నలిస్టులను ఉత్తేజపరిచారని వారు గుర్తు చేశారు.