అమరజవాన్లకు ప్రధాని నివాళి

అమరజవాన్లకు ప్రధాని నివాళిన్యూఢిల్లీ: భారత్​-పాకిస్థాన్​ మధ్య 1971లో జరిగిన యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అమర జవాన్లకు నివాళులర్పించారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద అంజలి ఘటించారు. యుద్ధంలో మరణించిన జవాన్లకు సంఘీభావంగా స్వర్ణ విజయ జ్యోతిని వెలిగించారు. ఈ అఖండ జ్యోతులను 1971 యుద్ధంలో పరమ్‌వీర్‌ చక్ర, మహావీర్‌ చక్ర పురస్కార గ్రహీత గ్రామాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు.  1971లో తూర్పు పాకిస్థాన్‌లో స్వతంత్ర పోరు మొదలై భారత్‌-పాక్‌ మధ్య యుద్ధానికి దారితీసింది. ఇందులో పాక్‌ను భారత్‌ ఓడించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది. ఆ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 16న విజయ్‌ దివస్‌ నిర్వహిస్తున్నారు. బుధవారం యుద్ధ స్మారకం వద్ద నిర్వహించిన వేడుకల్లో మోదీతో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ పాల్గొని అమరులకు నివాళులర్పించారు. ఈ ఏడాదితో భారత్‌ విజయానికి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘స్వర్ణ విజయ సంవత్సరం’గా పేర్కొంటూ దేశవ్యాప్తంగా వేడుకలను నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.