అదుపుతప్పి కారు బోల్తా ఇద్దరు మృతి

అదుపుతప్పి కారు బోల్తా ఇద్దరు మృతిఖమ్మం జిల్లా : జిల్లాలోని విజయవాడ-ఛత్తీస్‌గఢ్‌ జాతీయ రహదారిపై బుధవారం కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ నుంచి ఒడిశా వెళ్తున్న కారు పెనుబల్లి మండలం తుమ్మలపల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతిచెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎడవల్లికి చెందినవారిగా గుర్తించారు. వీరంతా వ్యాపారం నిమిత్తం విజయవాడ వైపు నుంచి ఒడిశాకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.