టీఎస్ హైకోర్టుకు మొదటి మహిళా జస్టిస్

టీఎస్ హైకోర్టుకు మొదటి మహిళా జస్టిస్హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమ కోహ్లీ నియమితుల‌య్యారు. ప్రస్తుతం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్న జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ను ఉత్తరాఖండ్‌కు బదిలీ అయ్యారు. ఢిల్లీలో సమావేశమైన ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం పలువురు హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీలకు సంబంధించి సిఫార‌సులు చేసింది. జస్టిస్‌ హిమ కోహ్లీ తెలంగాణ హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నిలిచారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. 1959 సెప్టెంబర్‌లో ఢిల్లీలో పుట్టిన జస్టిస్‌ హిమ కోహ్లీ 1979లో సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాల నుంచి బీఏ ఆనర్స్‌ హిస్టరీలో పట్టభద్రులయ్యారు. తరువాత ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌ లా సెంటర్‌ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1984లో ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌లో సభ్యురాలిగా నమోదై.. న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2006 మేలో ఢిల్లీ హైకోర్టులోనే అదనపు జడ్జిగా నియమితులయ్యారు. సుమారు 15 నెలల తరువాత పూర్తిస్థాయి జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. కొవిడ్‌-19 విస్తరణ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని జైళ్లలో రద్దీని తగ్గించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీకి హిమ కోహ్లీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.

ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా అరూప్ కుమార్‌ గోస్వామి

టీఎస్ హైకోర్టుకు మొదటి మహిళా జస్టిస్

ఇదిలా ఉండగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అరూప్‌ కుమార్ గోస్వామి నియమితులయ్యారు. ప్రస్తుతమున్న జస్టిస్‌ జేకే మహేశ్వరిని సిక్కిం సీజేగా బదిలీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్న జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ను ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు.