హాట్ డైలాగులు జస్ట్ ట్రైలరేనా?

హాట్ డైలాగులు జస్ట్ ట్రైలరేనా?

వరంగల్ టైమ్స్, ఎక్స్ క్లూజివ్ : తెలంగాణలో ఎన్నికలకు ఇంకా సమయముంది. కానీ ఎన్నికల వాతావరణం అయితే అప్పుడే క్రియేట్ అయ్యింది. ఎన్నికలు త్వరలోనే జరుగుతాయేమో అనేలా హీట్ నెలకొంది. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ మధ్య హాట్ హాట్ డైలాగులు పేలుతున్నాయి. హాట్ డైలాగులు జస్ట్ ట్రైలరేనా?

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఒక్కరే కాదు ఆ పార్టీ తరపున మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, కవిత కూడా జోరు పెంచారు. మోదీ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. మోడీ సర్కారుపై రెండేళ్లుగా సీఎం కేసీఆర్ అంతెత్తున లేస్తున్నారు. సమయం దొరికితే చాలు మోడీ పాలనా వైఫల్యాలను ఎండగడుతున్నారు. దేశానికి ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ పథకాలను కాపీకొట్టారంటూ చురకలు అంటిస్తున్నారు. తాజాగా ఈ రేసులోకి కేటీఆర్, హరీశ్ రావు, కవిత ఎంటరయ్యారు. తెలంగాణ వాయిస్ ను బలంగా వినిపిస్తున్నారు. మోడీ సర్కారులో తెలంగాణకు అన్యాయం జరిగిందని గొంతెత్తుతున్నారు.

కేసీఆర్ టీమ్ అంతా ఫుల్ స్వింగులో ఉంది. వచ్చే ఎన్నికలకు ముందుగానే సరంజామా అంతా సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఇప్పట్నుంచే హాట్ డైలాగులతో హీట్ పుట్టిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అనే భావన కలుగుతోంది. జనాలను ఎన్నికల మూడ్ లోకి తీసుకోవడమే లక్ష్యంగా మాటల మంటలు రేపుతున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నికలపై క్లారిటీ లేకుండానే ఈస్థాయిలో హాట్ డైలాగులు రావడానికి కారణం అదేనన్న వాదన వినిపిస్తోంది. రేసులో ముందున్నాం, మరోసారి అధికారంలోకి వస్తామన్న సంకేతాలు ఇవ్వడానికే గులాబీదళం ఈ స్ట్రాటజీని వ్యవహరిస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

అటు బీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ కూడా తగ్గేదే లేదంటోంది. బండి సంజయ్, అర్వింద్ లాంటి వారు ఎప్పట్నుంచో తెలంగాణ సర్కారుపై విమర్శలు చేస్తున్నా.. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా రేసులోకి ఎంటరయ్యారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను నేరుగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. బండి సంజయ్, అర్వింద్ లాగా కిషన్ రెడ్డి నోటి వెంట అంత ఈజీగా హాట్ డైలాగులు రావు. అలాంటిది కిషన్ రెడ్డి మాటల తూటాలు పేల్చడంపై రకరకాల అనుమానాలకు తావునిస్తున్నాయి. బీజేపీ హైకమాండ్ నుంచి కిషన్ రెడ్డికి ఏదో హింట్ వచ్చిందన్న పుకార్లు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కు ధీటుగా కౌంటర్ ఎటాక్ చేయాలని అమిత్ షా టీమ్ కిషన్ రెడ్డికి సూచిందన్న టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ కంటే ఎక్కువగా బీజేపీ వాయిస్ ను ప్రజల్లోకి వెళ్లేలా చూడాలని బీజేపీ హైకమాండ్ ఆయనకు సూచించినట్లు సమాచారం. అందుకే వారం రోజులుగా బీజేపీ వాయిస్ పెంచిందన్న వాదన వినిపిస్తోంది.

ఎవరి వాదన ఎలా ఉన్నా బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఢీ అంటే ఢీ అంటున్నాయి. బీఆర్ఎస్ ఒక్క మాటంటే బీజేపీ పది మాటలు అనడానికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలిస్తోంది. అందుకే ఇదంతా జస్ట్ ట్రైలర్ అనే మాటలు వినిపిస్తున్నాయి. ఎన్నికల దగ్గరకొచ్చేసరికి ఈ వార్ తారాస్థాయికి చేరడం పక్కా అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధికారంలోకి ఎవరు వస్తారోనన్న అంచనాలను పక్కన బెడితే ఈ రెండు రాజకీయపార్టీలు ఢీ అంటే ఢీ అనడం మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.