బీజేపీలోకి పొంగులేటి.. ఎందుకంటే ?

బీజేపీలోకి పొంగులేటి.. ఎందుకంటే ?

వరంగల్ టైమ్స్, ఎక్స్ క్లూజివ్ : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పట్టుంది. 2014లో ఏకంగా ఖమ్మం ఎంపీగా వైసీపీ నుంచి గెలిచి సత్తా చాటారు. అలాంటిది 2019 ఎంపీ ఎన్నికల్లో మాత్రం పొంగులేటికి బీఆర్ఎస్ సీటు దక్కలేదు. ఆయన స్థానంలో నామా నాగేశ్వరరావుకు సీటు వచ్చింది. బీజేపీలోకి పొంగులేటి.. ఎందుకంటే ?అయితే పొంగులేటి మాత్రం కేసీఆర్ ఆదేశాలను శిరసావహిస్తూ, నామాకు సహకరించారు. దీంతో నామా మంచి మెజార్టీతో గెలిచారు. నామా విజయానికి సహకరించిన పొంగులేటికి రాజ్యసభ ఎంపీ కానీ ఎమ్మెల్సీ సీటు కానీ ఇవ్వడానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని ఎప్పట్నుంచో లీకులు వస్తున్నాయి. కారణమేంటో తెలియదు కానీ ప్రతీసారి ఆశావహుల లిస్టులో ఆయన పేరు ఉంటుంది. కానీ బీఆర్ఎస్ హైకమాండ్ మాత్రం ఆయనకు ఇప్పటిదాకా ఎంపీ సీటు కానీ, ఎమ్మెల్సీ సీటు కానీ ఇవ్వలేదు. దీంతో నాలుగేళ్లుగా వేచిచూసి చూసి పొంగులేటి ఇక పార్టీని వీడడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చేశారట. బీజేపీ నాయకులు ఇప్పటికే ఆయనతో మంతనాలు జరిపారన్న లీకులు వస్తున్నాయి.

ఒకవైపు పొంగులేటి వేగం పెంచారన్న వార్తలతో బీఆర్ఎస్ కూడా స్పీడు పెంచింది. ఆయనకు భద్రతను కుదించింది. ఆయన పర్యటన సమయంలో వినియోగించే కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనాన్ని కూడా తొలగించారు. దీంతో పొంగులేటికి, బీఆర్ఎస్ కు మధ్య చెడినట్టేనని ప్రచారం జరుగుతోంది. ఇక ఏ క్షణంలోనైనా పొంగులేటి పార్టీ మారొచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సమయంలో పొంగులేటి సంచనల వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లుగా తనకు అవమానాలు జరిగాయన్నది ఆయన వాదన. రాబోయే రాజకీయ కురుక్షేత్రంలో తాను యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని పొంగులేటి స్పష్టం చేశారు. ఈ మాటల నేపథ్యంలో ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఆయనను తీసుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే పొంగులేటి చూపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈనెల 18న ఆయన అమిత్ షాతో భేటీ కానున్నారని సమాచారం. అంతేకాదు ఖమ్మం లోక్ సభ సీటు పొంగులేటికి ఇవ్వడానికి బీజేపీ గట్టి హామీ కూడా ఇచ్చిందని టాక్. ఎంపీగా బీజేపీ నుంచి పోటీ చేసి గెలిస్తే తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని కమలం పార్టీ నేతలు సూచిస్తున్నారట. పొంగులేటికి ఉన్నఆర్థిక, అంగబలం ద్రుష్ట్యా ఆయనకు కేంద్రమంత్రి సీటు దక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బీజేపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఇక పార్టీ మార్పుపై అనుచరులతోనూ పొంగులేటి డిస్కస్ చేయబోతున్నారని తెలుస్తోంది. మంగళవారం నుంచి అనుచరులతో ఆయన సమావేశాలుంటాయని తెలుస్తోంది.

పార్టీ మార్పు సంగతిని పక్కనబెడితే ఈసారి ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయడంపై పొంగులేటి డౌట్ గా ఉన్నట్లు సమాచారం. అయితే ఆయన సన్నిహితులు మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుతున్నారని టాక్. అనుచరులు, సన్నిహితుల అభిప్రాయం ప్రకారం ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే కొత్తగూడెం నుంచి కానీ లేకపోతే ఖమ్మం నుంచి కానీ పోటీ చేయడానికి పొంగులేటి సిద్ధంగా ఉన్నారని సమాచారం. పొంగులేటి సన్నిహితులు మాత్రం వ్యక్తిగతంగా ఆయనకు ఉన్న పాపులారిటీ ద్రుష్ట్యా ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం అని బల్లగుద్ది చెబుతున్నారట. కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేయడమే మంచిదని సూచిస్తున్నట్లు టాక్. అయితే ఎంపీగానా? లేదా ఎమ్మెల్యేగానా? అన్నది ఆయన ఎటూ తేల్చుకోలేక పోతున్నారట.

అయితే ఎంపీగా పోటీ చేసినా? ఎమ్మెల్యేగా పోటీ చేసినా? పొంగులేటి మాత్రం బీఆర్ఎస్ ను వీడడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. మరి నిజంగానే ఆయన బీఆర్ఎస్ ను వీడుతారా..? లేక త్వరలోనే బీజేపీ బాట పడతారా..? అన్నది వేచిచూడాలి.