భద్రకాళి ఆలయంలో కన్నుల పండుగగా మహాశివరాత్రి

భద్రకాళి ఆలయంలో కన్నుల పండుగగా మహాశివరాత్రి

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : నగరంలోని చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి క్షేత్రంలోని శ్రీ భద్రకాళి సమేత భద్రేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం భక్తి ప్రవత్తులతో ఎంతో వైభవోపేతంగా జరిగింది. గత 5 రోజులుగా ఎంతో నిష్టతో లోక కళ్యాణార్థం ప్రారంభమైన మహారుద్రయాగం పూర్ణాహుతితో మహాశివరాత్రి పర్వదినమైన నేడు ముగిసింది. వరంగల్ మహానగరంలోని ప్రముఖ న్యాయవాదులు చిదంబరనాథ్, కాకిరాల నరసింహరావుల సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడినట్లు ఆలయ ఈవో కె. శేషు భారతి తెలిపారు. మహారుద్రయాగ దాతల దంపతులకు ఈవో కె. శేషు భారతి భద్రకాళి అమ్మవారి శేషవస్త్రములను బహుకరించి, ప్రసాదాన్ని అందచేశారు.భద్రకాళి ఆలయంలో కన్నుల పండుగగా మహాశివరాత్రిమహాశివరాత్రి పర్వదినంతో ఉదయం 4 గంటల నుంచే వేలాదిమంది భక్తులు భద్రకాళి ఆలయానికి తరలివచ్చి ఐశ్వర్య ప్రదాత, తేజోలింగమూర్తి శ్రీ భద్రేశ్వరస్వామివారికి అభిషేకాలు జరిపారు. వేలాది మందిగా తరలివస్తున్న భక్తులతో భద్రకాళి ఆలయం కిక్కిరిసిపోయింది. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమ్రోగింది. మహాశివరాత్రి జాగరణను పురస్కరించుకుని సాయంత్రం వేళ ఆలయ అధికారులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.