రాష్ట్రంలో 3 రోజులపాటు వర్షాలు : వాతావరణ శాఖ

రాష్ట్రంలో 3 రోజులపాటు వర్షాలు : వాతావరణ శాఖహైదరాబాద్‌ : తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

నిన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోని ఉత్తర తమిళనాడు తీరంలో ఉన్న వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి పుదుచ్చేరి, చెన్నై మధ్యలో తీరాన్ని దాటినట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ సంచాలకురాలు డా. నాగరత్న తెలిపారు.

వెల్లూరుకి తూర్పు ఆగ్నేయ దిశగా 60 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం.. పశ్చిమ వాయువ్య దిశగా కదిలి, క్రమంగా బలహీనపడి రాగల 6 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ వాయుగుండం నుంచి ఉపరితల ద్రోణి కోస్తాంధ్ర తీరం మీదగా ఇంటీరియర్ ఒడిశా వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉన్నట్లు వెల్లడించారు. ఈ రోజు క్రింది స్థాయి గాలులు తూర్పు దిశగా రాష్ట్రంలోకి వీస్తున్నాయన్నారు.