ఢిల్లీ స్థాయిలో ఉద్యమం తప్పదన్న టీఆర్ఎస్

ఢిల్లీ స్థాయిలో ఉద్యమం తప్పదన్న టీఆర్ఎస్
హన్మకొండ జిల్లా : కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం రైతుల‌కు వ్య‌తిరేకంగా తెచ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్నట్లు ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌టించ‌డంపై టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాను రద్దు చేయడంపై రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు స్పందించారు. హన్మకొండ రాంనగర్ లోని మంత్రి నివాసంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి దయాకర్ రావుతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ అభ్యర్థి బండ ప్రకాష్, మేయర్ గుండు సుధారాణిలు పాల్గొన్నారు. నూతన వ్యవసాయచట్టాలను రద్దు చేసినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

కేసీఆర్ నాయ‌క‌త్వంలో చేప‌ట్టిన మ‌హాధర్నా దేశంలోనే పెద్ద మలుపు అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు తెలిపారు. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన, పరిపాలన ప్రజ్ఞ, దక్షత కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మోడీకి తెలుసు. అందుకే మోడీ దిగి వచ్చారని, టీఆర్ఎస్ ఆందోళనతో కేంద్రంలో చలనానికి ఒక కారణమైంద‌న్నారు. అన్ని భాషల మీద పట్టున్న సీఎం కేసీఆర్ రైతాంగ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తే ఏం జరుగుతుందో మోడీ ప్రభుత్వానికి తెలుసన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారత దేశ ప్రధాని అయిన మోడీ తమ ప్రభుత్వం వల్ల జరిగిన తప్పిదానికి హుందాగా క్షమాపణ చెప్పడం అభినందనీయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

మోడీకి ఉన్న సంస్కారం, హుందాతనంలో కొంచెమైనా తెలంగాణ బీజేపీ నేతలకు ఉంటే బాగుండేది. కేంద్రం తెచ్చిన నూత‌న చ‌ట్టాల వ‌ల్ల రైతాంగానికి భ‌విష్య‌త్‌లో క‌ష్టాలు వ‌స్తాయ‌ని గుర్తించి టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ వ్య‌తిరేకిస్తుంటే.. కేంద్రం తెచ్చ‌ిన చ‌ట్టాల‌తో రైతుల‌కు లాభం జ‌రుగుతుంద‌ని మొండి వాద‌న‌లు చేసిన రాష్ట్రంలోని స్థానిక బీజేపీ నాయ‌కులు ఇప్పుడు ఏం స‌మాధానం చేబుతార‌ని మంత్రి ఎద్దేవా చేశారు.

రైతుల సంక్షేమాన్ని మ‌రిచి, ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్రం తీసుకొచ్చిన నూత‌న సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా అలుపెరుగ‌ని పోరాటాలు చేసిన రైతుల‌కు సీఎం కేసీఆర్ అండ‌గా నిలిచార‌ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గుర్తు చేశారు. బీజేపీ ప్ర‌భుత్వం మెడ‌లు వంచి విజ‌యాన్ని సాధించిన రైతుల‌కు అభినంద‌న‌లు తెలిపారు. పోరాటంలో అసువులు బాసిన రైతులకు సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్య‌వ‌సాయాన్ని అభివృద్ది చేస్తూ, రైతాంగానికి అండ‌గా సీఎం కేసిఆర్ నిలిచార‌ని అన్నారు.

కేంద్రం తీసుకొచ్చిన న‌ల్ల చ‌ట్టాల‌కు మద్దతు ఇవ్వాలని కేంద్రం ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ , కేంద్రం తీరును మొదటి నుంచి సీఎం కేసిఆర్ వ్యతిరేకిస్తూనే ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల‌తో పార్ల‌మెంట్‌లో న‌ల్ల చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు బైకాట్ చేశార‌ని గుర్తుచేశారు. క‌రోనా స‌మ‌యంలో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌ల‌హీన‌ప‌డితే.. అంబానీ, అధానీల సంప‌ద పెరగ‌డానికి గ‌ల కార‌ణాల‌ను బీజేపీ నాయ‌కులు దేశ‌ప్ర‌జ‌ల‌కు వివరించి చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్ చేసిన ధర్నా వల్ల దేశంలో వున్న రైతులకు ధైర్యం వచ్చిందని అన్నారు. సీఎం స్థాయిలో కేసీఆర్ ధ‌ర్నాలు చేయడం వల్లే కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం దిగివ‌చ్చింద‌న్నారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. రైతుల కోసం రైతుబంధు, రైతు భీమా, సాగునీటి ప్రాజెక్టుల‌ను నిర్మించి రైతుల‌కు అండ‌గా ఉన్నార‌ని అన్నారు. అదే స్పూర్తితో తెలంగాణ‌లో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వ‌ర‌కు పోరాటం ఆగదని కేంద్రాన్నిహెచ్చరించారు. ఇప్ప‌టికైనా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు బుద్ది తెచ్చుకొని రైతు వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను వ‌దిలిపెట్టాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వ‌ర‌కు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేస్తున్న పోరాటంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు క‌లిసి రావాల‌ని సూచించారు.