కాంగ్రెస్ తోనే దేశాభివృద్ధి సాధ్యం : జంగా రాఘవరెడ్డి

కాంగ్రెస్ తోనే దేశాభివృద్ధి సాధ్యం : జంగా రాఘవరెడ్డిజనగామ జిల్లా : దేశాభివృద్ధికోసం ఎనలేని కృషిచేసిన భారత ప్రధానులలో అత్యున్నత ఘనత దక్కించుకున్న మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి అన్నారు. భారతదేశంలోని రాష్ట్రాలతో పాటు తెలంగాణ ప్రాంత బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందనదానికి ఇందిరమ్మ పాలన ఒక్కటే సాక్ష్యమని జంగా రాఘవరెడ్డి కొనియాడారు.

మాజీ ప్రధాని, స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకల సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జంగా రాఘవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందిరమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇందిరా గాంధీ జయంతి ఉత్సవాల సందర్భంగా బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిడిగొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కట్కూరు గ్రామంలోని ఇందిరా గాంధీ విగ్రహానికి గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల బాలయ్య పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ఇందిరమ్మ పాలన, కాంగ్రెస్ పాలన గురించి జంగా రాఘవరెడ్డి గుర్తు చేశారు. స్వార్థపూరిత రాజకీయాలకు చోటు లేకుండా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశాభివృద్ధికోసం కృషి చేసిన ఘనత ఇందిరా గాంధీకే దక్కుతుందని గుర్తు చేశారు.

రైతులు పండించిన పంటలపై ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరును జంగా రాఘవరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనను ఆయన దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉందని, రైతులకు తోడుగా ఉంటుందని తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎర్రమల సుధాకర్, వేముల సత్యనారాయణ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు లింగాల జగదీశ్వర్ రెడ్డి, చింతకింది మల్లేశం, కొత్త కరుణాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ దయాకర్ రెడ్డి, మంత్రి శ్రీశైలం, గాదేపాక రామ్ చందర్ , ఎన్ఎస్ యూఐ జనగామ జిల్లా అధ్యక్షులు అభి గౌడ్, భాను, శివ రాజ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.