రాష్ట్రంలో రెండ్రోజులు వర్షాలు
వరంగల్ టైమ్స్,హైదరాబాద్: తెలంగాణలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. నైరుతి తిరోగమనం చివరి దశకు చేరుకోవడంతో 10 రోజులుగా వర్షాలు పడటం లేదని తెల్పింది.రాష్ట్రం వైపు తూర్పు, ఈశాన్యం దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. భారీ వర్షాలకు అవకాశం లేకపోయినా జల్లులు కురుస్తాయని తెల్పింది. ఈ సారి తెలంగాణలోని 18 జిల్లాల్లో అధిక వర్షాపాతం నమోదు కాగా, మిగిలిన జిల్లాల్లో లోటు వర్షాపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. నైరుతి సోమవారంతో రాష్ట్రాన్ని వీడిపోతున్నట్లు పేర్కొన్నది.