ఇలా తొలగిస్తే ఎలా..

ఇలా తొలగిస్తే ఎలా..

ఇలా తొలగిస్తే ఎలా..

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : బీజేపీ రాష్ట్ర నేత, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు బీఆర్ఎస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనకు గత యేడేండ్లుగా కల్పిస్తున్న భద్రతను మంగళవారం ఉపసంహరించింది. ఎర్రబెల్లి ప్రదీప్ రావు వద్ద పనిచేస్తున్న గన్ మెన్లను (2 ప్లస్ 2) వెంటనే వెనక్కు రావాలని మంగళవారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి ఆదేశాలు రావడంతో నలుగురు గన్ మెన్లు వెళ్లిపోయారు. ప్రదీప్ రావుకు ఏఆర్ విభాగం నుంచి గన్ మెన్లు విధులు నిర్వర్తించేవారు. కాగా ఈ విషయమై ఏఆర్ విభాగం అడిషనల్ డీసీపీ, ఆర్ఐలను వివరణ కోరగా, సీపీ రంగనాథ్ ఆదేశాల మేరకు గన్ మెన్లను తొలగించినట్లు వెల్లడించారు.

అయితే ఈ చర్యపై ప్రదీప్ రావు వెంటనే స్పందించారు. తనకు ప్రాణ హాని ఉందనే కారణంతో 2018లో ప్రభుత్వం గన్ మెన్లను కేటాయించిందని, ఇప్పుడు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గన్ మెన్లను ఉపసంహరించడం విస్మయం కల్గించిందని అన్నారు. బీజేపీలో చేరినందుకే రాజకీయ కుట్రతో గన్ మెన్లను తొలగించారని ఆరోపించారు. ఇది స్థానిక ఎమ్మెల్యే రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. తనకు ఏదైనా హాని జరిగితే , అందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే నరేందర్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రదీప్ రావు హెచ్చరించారు.

కాగా, టీఆర్ఎస్ లో సుదీర్ఘకాలం ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు, 2022 సెప్టెంబర్ లో బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గన్ మెన్లను తొలగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.