వందేభారత్ రైలు ఎక్కడెక్కడ ఆగుతుందంటే..!
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు రానుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును కేటాయించింది. త్వరలో మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఏపీకి కేటాయించనుంది. తెలంగాణకు కేటాయించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ముందు విజయవాడ – సికింద్రాబాద్ మధ్య నడపాలనుకున్నారు. ఇప్పుడు రూట్ మార్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్ని పూర్తిగా కలిపేలా సికింద్రాబాద్ నుంచి విశాఖ వరకు సాగనుంది.
జనవరి 19న సికింద్రాబాద్-విశాఖపట్టణం వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఏపీకి కేటాయించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రాక ఆలస్యమయ్యే అవకాశమున్నందున సికింద్రాబాద్-విజయవాడ వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను విశాఖపట్నం వరకు పొడిగించింది.
* వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కడెక్కడ ఆగుతుందంటే..
సికింద్రాబాద్ నుంచి బయల్దేరే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. ఇదే విషయాన్ని మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకు 7 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభంకానున్న ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ 8వ రైలు అని తెలిపారు.