ఆ గ్రామ సర్పంచ్ మనసున్న మహారాజు

ఆ గ్రామ సర్పంచ్ మనసున్న మహారాజుమహబూబాబాద్ జిల్లా: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి కుటుంబ బంధాల విలువ తెలియచేస్తోంది.. తల్లీ బిడ్డా..భార్యా భర్త.. అనుబంధాలను సైతం దూరం చేస్తోంది. ఒక్క సారి కరోనా వచ్చిందంటే చాలు అప్పటి వరకు ఎంతో ప్రేమ ఆప్యాయతలు కురిపించుకున్న కుటుంబ సభ‌్యులు సైతం కరోనా దాడితో ఒక్కసారిగా దూర మవుతూనే వున్నారు.. కరోనా బారిన పడితే అది హోం క్వారంటైన్ అయినా….వల్లకాడులో బూడిదైనా ఒంటరిగా పోవాల్సిందే అన్నట్లుగా కోవిడ్ బారిన పడిన వారి పరిస్థితి..అయితే వీటన్నింటినీ విస్మరిస్తూ.. కన్నవారు..కుటుంబ సభ్యులు, స్థానికులు సైతం దూరంగా వున్న ఓ కోవిడ్ బాధితునికి ఓ మనసున్న మారాజు అండగా నిలిచాడు.

చివరగా కోవిడ్ తో మరణించిన ఆ బాధితునికి గ్రామ ప్రథమ పౌరుడు దగ్గరుండి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం లక్ష్మీపురం (బ్రాహ్మణపల్లి ) గ్రామానికి చెందిన తురక ఉపేందర్ గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్నాడు. హోం క్వారంటైన్ లో వుండి చికిత్స పొందుతున్నాడు. అయితే కోవిడ్ తీవ్రత ఎక్కువ కావడంతో ఉపేందర్ ఆదివారం మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. తురక ఉపేందర్ మృతితో బాధిత కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నప్పటికీ, అతని పార్థీవ దేహాన్ని ముట్టుకోవడానికి సైతం కుటుంబ సభ‌్యులు నిరాకరించారు. తమకు ఎక్కడ కరోనా సోకుతుందో అని వణికిపోయారు.

ఆ గ్రామ సర్పంచ్ మనసున్న మహారాజుచుట్టుప్రక్కల వారు సైతం ఉపెందర్ పార్థీవ దేహాన్ని చూసేందుకు నిరాకరించారు. ఇదంతా గమనించిన గ్రామ సర్పంచ్ ఎండీ షఫీయోద్దీన్ అడుగు ముందుకు వేశాడు. కరోనాతో చనిపోయిన ఉపెందర్ పార్థీవ దేహానికి అంత్యక్రియలు చేసేందుకు ముందుకు వచ్చాడు. గ్రామపంచాయితీ సిబ్బందితో కలిసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉపెందర్ కు అంతిమ యాత్ర చేసి, హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేశారు.

దీంతో గ్రామస్థులంతా సర్పంచ్ ను శభాష్ అంటున్నారు. తమ గ్రామ సర్పంచ్ మనసున్న మారాజని పొగడ్తలు వినిపిస్తున్నారు. అయితే గ్రామ సర్పంచ్ మాత్రం సాటి మనిషిగా, గ్రామ ప్రథమ పౌరుడిగా నేను చేసిన పనిలో గొప్పేమి లేదని సింప్లిసిటీని ప్రదర్శించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. కరోనా కష్టకాలంలో నా వాళ్లు, రక్తసంబంధీకులు అనే అంశాన్ని పక్కనపెడితే..సాటి మనిషిగా సాయం చేసి., కోవిడ్ బాధితులకు చేయూతనిస్తూ, వారు కన్నుమూసినప్పుడు కాటికి పంపే వాళ్లు ఉండటమే మహాగొప్పగా తయారైంది ఈ కాలం. మరి ఇలాంటి సమయంలో ఇంత మంచి పని చేసి మానవత్వాన్ని చాటుకున్న లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ కు, గ్రామ సిబ్బందికి warangaltimes తరపున హ్యాట్సాప్ చెప్తాం..