తెలుగువారి ‘సత్యభామ’ కథ
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని మెప్పించిన తొలి తరం నటి జమున (86) ఇక లేరు. వయోధికభారంతో, అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని నివాసంలో ఆమె కన్నుమూశారు. 11గంటలకు జమున భౌతికకాయాన్ని ఫిల్మ్‌చాంబర్‌కు తరలిస్తారు. జమున 1936 ఆగస్ట్ 30న హంపీలో జన్మించారు. తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేశి. తండ్రి వ్యాపార రీత్యా జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. ఆమె తొలిచిత్రం పుట్టిల్లు. రామారావు, అక్కినేని, జగ్గయ్య వంటి అలనాటి అగ్రహీరోల సరసన నాయికగా నటించింది.ఎన్ని పాత్రల్లో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్రం సత్యభామ క్యారెక్టరే. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేమన్నట్టుగా జీవించారు జమున. తెలుగులో వందల సంఖ్యలో సినిమాల్లో నటించి మాతృభాష తెలుగు కాకపోయినా జమున తెలుగు నటిగా గుర్తింపును సంపాదించుకున్నారు. హంపీలో పుట్టిన జమున పాఠశాలలో చదువుకునే సమయంలో నాటకాల వైపు ఆకర్షితులయ్యారు. నాటకాల్లో అద్భుతంగా నటించడంతో ఈ నటికి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. సత్యభామ పాత్రలో ఎక్కువగా నటించి ఆ పాత్రకు తనను మించి ఎవరూ న్యాయం చేయలేరనే పేరును సంపాదించుకున్నారు.
తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా జమున నటించగా ఆ సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి. బాల్యంలోనే జమున సంగీతంలో కూడా శిక్షణ తీసుకున్నారు. ఆమె నటనకు ఎన్నో అవార్డులు సైతం లభించాయి. జమున ఎన్నో సేవాకార్యక్రమాలు చేసి మంచి పేరును సంపాదించుకున్నారు. అయితే నిర్మాతలను డబ్బులు అడగకుండా ఈ నటి ఎక్కువ మొత్తంలో నష్టపోయారు. ఓ రోజు పీకల వరకు తాగిన ఎస్వీ రంగారావు జమున ఉంటున్న గది తలుపు తట్టారట. రోజు జరిగిన సంఘటనని ఇప్పటికి గుర్తు చేసుకుంటూ ఉంటారు జమునమ్మ.
తెల్లవార్లు ఆమెను కూర్చోబెట్టి జీవితం గురించిన అనేక విషయాలను అలాగే జీవితం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జమునకి చెప్తూ వస్తున్నారట ఎస్వీ రంగారావు. జీవితంలో ఎలా మెలగాలి ఎవరితో ఉండాలి అనే విషయంపై జమునకు సూచనలు చేస్తున్నారు. కానీ ఇదంతా జరుగుతున్న కొద్ది జమునకు చిరాకు పెరిగిపోతూ వస్తుంది. అప్పటికే ఉదయం 5 అవుతుంది కానీ ఆయనేమో గది వదిలి వెళ్లడం లేదు. ఇక కాసేపటికి మెల్లిగా లేచి వెళ్ళబోతూ ఓ పిల్ల ఒక కుర్ర వెధవతో నీ యవ్వారం గురించి అందరూ చెప్పుకుంటున్నారు నేను కూడా విన్నా. అతడు అందరూ ఎన్టీఆర్ అవుతారని చెప్పుకుంటున్నారు కానీ వాడు మరో తాగుబోతు ఎస్వీఆర్ అవుతాడు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్లిపోయారు.
అప్పుడు జమునకు జ్ఞానోదయం అయ్యింది. ఆ కుర్ర హీరో ఎవరో బయటకు చెప్పకపోయినా అతడికున్న మందు అలవాటు గురించి గుర్తొచ్చింది. ఇది బలహీనతగా మారుతుందని ఆమె గ్రహించి అతనితో పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకుంది. అతడు ఎవరో కాదు హీరో హరినాథ్. ఆ తర్వాత కాలంలో అతడు మాత్రం మందుకు బానిసై సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోవడమే కాదు ఈ లోకం నుంచే శాశ్వతంగా వెళ్లిపోయారు.ఆనాడు ఎస్వీఆర్ జాగ్రత్తలు చెప్పి ఉండకపోతే ఆమె జీవితం కూడా నాశనం అయ్యేదని ఆమె ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటారు.