బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురు మృతి

బెంగళూరు: బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోరమంగళ ప్రాంతంలో ఓ ఆడీ క్యూ3 కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు మృతి చెందారు. ఆరుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా.. తుదిశ్వాస విడిచారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. స్తంభాన్ని ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగడం ప్రమాద తీవ్రతను పెంచింది. ప్రమాదానికి గురైన కారును తమిళనాడుకు చెందిన ఓ ఎమ్మెల్యే వాహనంగా భావిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రమాదానికి సంబంధించిన చిత్రాలు చక్కర్లు కొడుతున్నాయి. ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.