రైతు ఉద్యమానికి అండగా సాఫ్ట్‌వేర్‌

రైతు ఉద్యమానికి అండగా సాఫ్ట్‌వేర్‌న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అన్నదాతలు చేస్తున్న ఉద్యమానికి రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. కేంద్రం తీరును ఎండగడుతూ రాస్తారోకో, ధర్నాలు కొనసాగిస్తున్న రైతులకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అనూహ్యమైన సహకారం లభిస్తోంది. ‎మరో వైపు సోషల్ మీడియా వేదికగా రైతుల ఆందోళనపై దుష్ప్రచారం జరుగుతోంది. దీన్ని అడ్డుకునేందుకు రైతులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సపోర్ట్ గా నిలిచారు. రైతులు చేస్తున్న ఉద్యమంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ట్విట్టర్ ద్వారా అడ్డుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ సెలవుపై పంజాబ్ వచ్చిన భవ్ జిత్ సింగ్ రైతుల ఆందోళనలు గమనిస్తూనే వున్నాడు.. రైతులకు సామాజిక మాధ్యమాల గురించి పెద్దగా తెలియనప్పటికీ, సోషల్ మీడియాలో వారి ఉద్యమంపై జరుగుతున్న దుష్ప్రచారం, నకిలీ వార్తల వ్యాప్తి తన దృష్టికి రావడంతో ఆవేదన చెందాడు. దీంతో రైతులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు భవ్ జిత్ సింగ్ తెలిపారు. ‘ట్రాక్టర్‌ టు ట్విటర్‌’ అనే ట్విటర్‌ హ్యాండిల్‌ను రూపొందించి రైతులకు సంబంధించిన సమాచారాన్ని పోస్టు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నవంబరు 28 నుంచి ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది తమ పోస్టులను వీక్షించినట్లు తెలిపారు. రైతుల ఉద్యమానికి సంబంధించిన వార్తా చిత్రాలు, వీడియోలు, నినాదాలను హిందీ, ఇంగ్లీషు, పంజాబీలలో పోస్టు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కృషిలో భవ్ జిత్ సింగ్ మిత్రుడు జస్ ప్రీత్ సింగ్ కూడా భాగస్వామి అయ్యాడు. రైతులు చేస్తున్న న్యాయమైన పోరాటాన్ని ప్రపంచానికి సోషల్ మీడియాలో ఎలా తెలపాలో తెలియదు. ఎలా ట్వీట్ చేయాలో రైతులకు తెలియదు. వారికి ఐటీ విభాగం ఏమీ లేదు.. అందువల్ల వారి ఉద్యమాన్ని ట్విటర్ తో అనుసంధానం చేయాలనుకున్నామని జస్ ప్రీత్ తెలిపాడు. సామాజిక మాధ్యమంలో రైతుల ఆందోళనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవడానికే ‘ట్రాక్టర్‌ టు ట్విటర్‌’ ను ప్రారంభించినట్లు జస్ ప్రీత్ తెలిపారు. దీని నిర్వహణకు చాలా మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ఆయన వెల్లడించారు. దీంతో రైతులపై దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారానే గట్టిగా సమాధానం ఇవ్వగలుగుతున్నట్లు తెలిపారు.