కరీంనగర్ జిల్లా: కొంతమంది పిల్లలు కావాలన్నది ఇచ్చే వరకు మొండిపట్టు పడుతుంటారు. అది ఏదైనా తెచ్చి ఇచ్చేంతవరకు నానాయాగీ చేస్తుంటారు. తల్లిదండ్రులు చిన్న వయస్సునో.. కొడుకని అతి గారాంబం చేయడం వల్లనో పిల్లలు అలా తయారవుతుంటారు. ఈ కోవలోకి చెందినదే ఆ ఘటన కూడా. ఓ బాలుడు పట్ల తల్లిదండ్రులు చేసిన అతి గారాబం అతడి కొంపముంచింది. పుట్టినరోజు డ్రెస్ కోనివ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన మ్యాకల నర్సయ్య, విజయ భార్యభర్తలు. వీరికి కొడుకు నివాస్(16), కూతురుహరీక(10) ఉన్నారు. నివాస్ గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విద్యాసంస్థలు తెరుచుకోకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. వాస్తవానికి నర్సయ్యది నిరుపేద కుటుంబం. అయినా కొడుకును గారాంబం చేస్తూ పెంచారు. అడిగిందల్లా ఇచ్చేవారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో నివాస్‌కు అవసరమైనవి కొనివ్వడం.. మరికొన్నింటిని తిరస్కరించడం చేశారు. అయితే నివాస్ తను కోరినవి దక్కించుకోవాలన్న పంతంతో తల్లిదండ్రులను బెదిరించడం మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అతి గారాబం చేయడంతో ప్రతిసారి చచ్చిపోతానంటూ బెదిరించి కావాల్సింది సాధించుకోవడం ఆ బాలుడికి అలవాటు. ఈ క్రమంలోనే సదరు బాలుడి పుట్టిన రోజు గురువారం కావడంతో కొత్త డ్రెస్ కొనుక్కోవాలని భావించాడు. అందులో భాగంగానే కొత్త డ్రెస్ కొనుగోలు చేసేందుకు తల్లిదండ్రులను పట్టుబట్టాడు. డబ్బులు లేవంటూ బాలుడిని తల్లిదండ్రులు మందలించారు. గతంలో లాగే చనిపోతానంటూ బాలుడు ఇంటిలోపలికి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. తల్లిదండ్రులు కిటికీలో నుంచి ఎంత పిలిచినా తలుపు తీసేందుకు నిరాకరించాడు. స్నేహితులు బయటకు రావాలంటూ కోరినా మొండిగా సమాధానం చెప్పాడు. దీంతో కోపం చల్లారక వాడే బయటకు వస్తాడని తల్లిదండ్రులు భావించారు. చచ్చిపోతున్నట్టు నటిస్తానని తాడుతో ఉరేసుకున్నట్టు ప్రయత్నించే క్రమంలో తాడు మెడకు బిగించుకుని చనిపోయాడు. ఊహించిన ఈ ఘటనకు తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.