సచివాలయం కూల్చివేతకు హైకోర్టు అనుమతి

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు అనుమతిహైదరాబాద్: తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై కొనసాగున్న ఉత్కంఠకు తెరపడింది. కూల్చివేతకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. భవనాల కూల్చివేతను కొనసాగించేందుకు అనుమతించింది. కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పి.ఎల్‌.విశ్వేశ్వరరావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు సుదాకర్‌ గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గత వారం రోజులుగా సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. సచివాలయం కూల్చివేతకు ముందస్తు పర్యావరణ అనుమతి తీసుకోలేదని గతంలో విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై అడ్వొకేట్‌ జనరల్‌ ప్రసాద్‌ స్పందిస్తూ… కూల్చివేత సమయంలో పర్యావరణ అనుమతి అవసరం లేదని, జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకున్నామని తెలిపారు. నిర్మాణానికి భూమిని సిద్ధం చేసేందుకు పర్యావరణ అనుమతి అవసరమని, కూల్చివేతలు.. నిర్మాణానికి భూమిని సిద్ధం చేయడానికేనని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై కేంద్ర పర్యవరణ మంత్రిత్వ శాఖను వివరణ కోరింది. తాజాగా కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్రం చెప్పడంతో పిటిషన్‌ను రద్దు చేస్తూ..సచివాలయ నిర్మాణాల కూల్చివేతకు హైకోర్టు మార్గం సుగమం చేసింది.