మదనపల్లి : చిన్నమ్మ చనిపోయిన తరువాత ఆమె చెక్కులను వక్రమార్గంలో ఐదుగురికి జారీ చేసిన కేసులో సస్పెండయిన జడ్జి రామకృష్ణను మదనపల్లి టూటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపడుతున్నాని తెలిపారు. సస్పెండ్ జడ్జి రామకృష్ణ చిన్నమ్మ సుచరిత (65)కు పిల్లలు లేకపోవడంతో ఆమె రామకృష్ణ ఇంట్లోనే ఉండేది. అయితే జూన్ 6, 2019న ఆమె మృతిచెందింది. దీంతో రామకృష్ణ తన అప్పులను తీర్చేందుకు ఐదుగురికి ఆమె చెక్కులు ఇచ్చాడు. ఈ చెక్కులపై చనిపోయిన సుచరిత సంతకం ఉంది. దీంతో కెనరా బ్యాంకు మేనేజర్ కిరణ్ కుమార్ ఆగస్టు 6,2020న మదనపల్లి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె చనిపోయిన తరువాత చెక్కులు ఇష్యూ కావడంతో పోలీసులను ఆశ్రయించానని బ్యాంకు మేనేజర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫోరెన్సిక్ రిపోర్టు, మరణ ధ్రువీకరణ పత్రాలను డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌గా పోలీసులు చూపించారు. రామకృష్ణపై పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయనపై బీ కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని పోలీసులు తెలిపారు.