సామాజిక సేవ అభినందనీయం

సామాజిక సేవ అభినందనీయంమంగళగిరి: మసీదు​ కేంద్రంగా కుల, మతాలకు అతీతంగా సామాజిక సేవ చేయడం అభినందనీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. మంగళగిరి పట్టణంలోని నిడమర్రు రోడ్డులో ఇటీవల నూతనంగా నిర్మించిన మసీద్​ -ఎ- అన్వరి, ఇస్లామిక్ సెంటర్ కు శుక్రవారం వచ్చిన ఆయన జుమాహ్ నమాజ్ లో పాల్గొన్నారు. అనంతరం మసీద్​ ఆవరణలో ఏర్పాటు చేసిన మదర్సా, ఇస్లామిక్ సెంటర్లను పరిశీలించారు. మసీద్​ కేంద్రంగా విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన కల్పించడంతో పాటు ప్రజలకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. విద్యాభివృద్ధికై మదర్సాను ఏర్పాటు చేయడం ఆహ్వానించదగిన విషయమన్నారు. మహిళలకు స్వయం ఉపాధి పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు చేతివృత్తులను సైతం నేర్పించడం శుభ పరిణామమన్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన మసీద్​లో సామాజిక సేవా కార్యక్రమాలు భవిష్యత్తు లో మరిన్ని నిర్వహించాలని ఇందుకు ప్రభుత్వం తప్పకుండా తమ వంతు సహాయ సహకారాలను అందిస్తుందని ఉపముఖ్యమంత్రి అంజాద్​బాషా మసీద్​ కమిటీ సభ్యులకు హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ ప్రతినిధులు శిలార్, రఫీ, సంధానీ, ఖదీర్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు