గవర్నర్‌తో తీపి జ్ఞాపకాలు మరువలేనివి : జగన్‌

గవర్నర్‌తో తీపి జ్ఞాపకాలు మరువలేనివి : జగన్‌

గవర్నర్‌తో తీపి జ్ఞాపకాలు మరువలేనివి : జగన్‌

వరంగల్ టైమ్స్, విజయవాడ : గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఏపీ ప్రభుత్వం మంగళవారం వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. గవర్నర్‌ వ్యవస్థకు నిండుతనం తెచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్ అని వైఎస్ జగన్ కొనియాడారు. రాజ్యాంగ వ్యవస్థలో సమన్వయాన్ని ఆచరణలో చూపారని అన్నారు. ఒక తండ్రిలా, పెద్దలా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అండగా నిలిచారని సీఎం ప్రశంసించారు. గవర్నర్‌తో తనకున్న తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనని సీఎం పేర్కొన్నారు.

గవర్నర్‌ విద్యావేత్త, న్యాయ నిపుణులు, స్వాతంత్ర్య సమరయోధులని ఆయన గుర్తు చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, ఒడిశా బార్‌ అసోసియేషన్‌లో కీలకపాత్ర పోషించారని సీఎం ప్రస్తావించారు. గవర్నర్‌ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. బిశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రజలు, ప్రభుత్వం తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సీఎం జగన్‌ చూపిన గౌరవం, ఆప్యాయత మరువలేనివని ఆ సందర్భంగా గవర్నర్‌ తెలిపారు. గవర్నర్‌, సీఎం సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు. సీఎం జగన్‌ అందరికీ సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని అన్నారు. ‘ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారని ప్రారంభంలో అడిగా. దేవుడి దయతో అన్నీ పూర్తవుతాయని సీఎం జగన్‌ చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ముందుంది.

ప్రజలు అందించిన ప్రేమ, అభిమానం, సహకారం ఎంతో అద్భుతమైనది. కరోనా కాలంలో ఏపీలోని వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు ప్రాణాలకు తెగించి సేవలు అందించారు. సీఎం జగన్‌ను నా కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నా రెండో ఇల్లు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏపీ ప్రజలను మరవను’ అని గవర్నర్‌ ప్రసంగించారు. కాగా బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా బదిలీ అయిన విషయం తెలిసిందే. మూడున్నర సంవత్సరాల పాటు ఆయన ఏపీ గవర్నర్‌గా సేవలందించారు.