మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం ముందడుగు

మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం ముందడుగు

ఢిల్లీ: మరో భారీ ప్రాజెక్ట్‌కు ముందడుగు వేస్తోంది మోదీ ప్రభుత్వం. పీఎం వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్‌ఫేస్-పీఎం వాణి పేరుతో అతిపెద్ద ప్రాజెక్ట్ చేపట్టబోతోంది. ఈ ప్రణాళికలకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర తెలిపింది. పబ్లిక్ వైఫై సర్వీస్ అందించడమే పీఎం వాణి లక్ష్యం. దేశంలోనే అతిపెద్ద వైఫై నెట్వర్క్ ఏర్పాటు ఈ ప్రాజెక్టు అని ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం దేశమంతా పబ్లిక్ డేటా సెంటర్స్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఎలాంటి లైసెన్స్, ఫీజు, రిజిస్ట్రేషన్ ఉండవని పేర్కొన్నారు. దేశంలో వైఫై నెట్వర్క్ వృద్ధిని ప్రోత్సహించేందుకే ఈ ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. వ్యాపారులు భారతీ ఎయిర్‌టెల్, రిలయెన్స్ జియో లేదా ఇతర ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సేవల్ని పొంది తమ ప్రాంతంలో వైఫై అందించొచ్చని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరించారు. పబ్లిక్ వైఫై ద్వారా ఉపాధి పెరగడంతో పాటు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఆదాయం పెంచుతుందన్నారు. మొత్తంగా ఈ ప్రయత్నం దేశ జీడీపీని వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. పీఎం వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్‌ఫేస్ పీఎం వాణిలో లో వేర్వేరు ప్లేయర్స్ ఉంటారు. పబ్లిక్ డేటా ఆఫీస్, పబ్లిక్ డేటా అగ్రిగేటర్, యాప్ ప్రొవైడర్, సెంట్రల్ రిజిస్ట్రీ లాంటివి ఉంటాయి. పబ్లిక్ డేటా ఆఫీస్ వైఫై యాక్సెస్ పాయింట్స్‌ని ఏర్పాటు చేయడంతో పాటు వాటిని మెయింటైన్ చేస్తాయి. సబ్‌స్క్రైబర్లకు బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని అందిస్తాయి. ఇక పబ్లిక్ డేటా అగ్రిగేటర్ ఆథరైజేషన్, అకౌంటింగ్ వ్యవహారాలను చూస్తాయి. పీఎం వాణి ప్రాజెక్టు ద్వారా ఏర్పాటైన వైఫై హాట్‌స్పాట్స్ కోసం యాప్‌ను రూపొందించే బాధ్యత యాప్ ప్రొవైడర్లది. ఇక సెంట్రల్ రిజిస్ట్రీలో యాప్ ప్రొవైడర్స్, పబ్లిక్ డేటా ఆఫీస్, పబ్లిక్ డేటా అగ్రిగేటర్ వివరాలు ఉంటాయి. సెంట్రల్ రిజిస్ట్రీని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలీమెటిక్స్ నిర్వహిస్తుంది. వీటన్నిటి కోసం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కోటి డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఇక కొచ్చి, లక్షద్వీప్ మధ్య సబ్‌మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.