ఎమ్మెల్యేపై మహిళా సర్పంచ్ లైంగిక ఆరోపణలు !
వరంగల్ టైమ్స్, జనగామ జిల్లా : ఎప్పుడూ మహిళలతో వివాదాల్లో చిక్కుకునే స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య మళ్లీ అలాంటి చిక్కుల్లోనే పడ్డారు. తనను లైంగికంగా ఎమ్మెల్యే రాజయ్య వేధిస్తున్నాడంటూ ఓ మహిళా సర్పంచ్ కన్నీరు పెట్టుకుంటూ తెరమీదికి రావడం తీవ్ర దుమారం రేపింది. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కురుసుపల్లి నవ్య ఎమ్మెల్యే రాజయ్యపై ఆరోపణలు చేసింది. ధర్మసాగర్ మండలానికి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు ఓ నాయకుడి కోరిక తీర్చమంటూ తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె కన్నీరు పెట్టుకుంది. వారి మాట కాదనడంతో గ్రామాభివృద్ధికి నిధుల కేటాయింపులో వివక్షచూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు కూడా తనను పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. లైంగిక రాయబారాలు పంపిన వారిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని, నేతల కోరికలు తీర్చేందుకు కాదంటూ ఆమె భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఆరోపణలపై స్థానిక బీఆర్ఎస్ నేతలు, అగ్రనాయకత్వం ఎలా స్పందిస్తారో తెలియాలి.