కాళేశ్వరంలో కన్నుల పండుగగా శివపార్వతుల కళ్యాణం

కాళేశ్వరంలో కన్నుల పండుగగా శివపార్వతుల కళ్యాణం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో కన్నుల పండుగగా శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం జరిగింది. మంగళవారం కాళేశ్వరంలో గల కాళేశ్వర-ముక్తేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా స్వామి వారిని సందర్శించారు, పూజారులు ప్రత్యేక పూజలు జరిపి స్వామివారి తీర్థ ప్రసాదాలు జిల్లా కలెక్టర్ కి అందించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా దేవాలయ ప్రాంగణంలో, స్నానఘట్టాల వద్ద ముఖ్య కూడలిలో నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ జరుగుతుందన్నారు.కాళేశ్వరంలో కన్నుల పండుగగా శివపార్వతుల కళ్యాణంస్నానఘట్టాల వద్ద మహిళా భక్తులకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పైపుల ద్వారా షవర్ బాత్, వైద్య ఆరోగ్య శాఖ వారిచే ఆరోగ్య కేంద్రాలు, మిషన్ భగీరథ వారిచే కళ్యాణానికి వచ్చే భక్తులకు మినరల్ వాటర్ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవంలో పోలీసుల బందోబస్తుతో పాటు, స్నానఘట్టాల వద్ద రెస్క్యూ టీం సిద్ధంగా ఉంచినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ముఖ్యంగా పారిశుద్ధ్య లోపం ఏర్పడకుండా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్మికులచే పారిశుద్ధ్య కార్యక్రమాలు, నిరంతర విద్యుత్ సౌకర్యం, సాంస్కృతిక కార్యక్రమాలు, గోదావరి నదిలో గజాల ఏర్పాటు, నిరంతర పోలీస్ పర్యవేక్షణ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని తిలకించాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.

సాయంత్రం నాలుగు గంటలకు మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎంపీపీ రాణి భాయి, జెడ్పిటిసి గుడాల అరుణ, ఎంపీటీసీ రేవెళ్లి మమత , గ్రామ సర్పంచ్ వసంత, ప్రజా ప్రతినిధులు శివ కళ్యాణానికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ఈవో కార్యాలయం నుండి ఆలయంలోని కళ్యాణమండపం వరకు మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొని వెళ్లారు. అనంతరం 4:35 నిమిషాలకు కళ్యాణ ఘట్టం మొదలుకాగా భక్తులు జరుగుతున్న శివపార్వతుల కళ్యాణం భక్తిశ్రద్ధలతో వీక్షించారు. 5:00 గంటలకు జిలకర బెల్లం కార్యక్రమం జరగగా 5: 30 నిమిషాలకు ముఖ్య ఘట్టం సుముహూర్త సమయానికి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎస్. మహేష్, తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శంకర్ మరియు పోలీస్ అధికారులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.