కేటీఆర్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి 

కేటీఆర్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

కేటీఆర్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : ఈ నెల 27న కేటీఆర్ వేలేరు పర్యటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, పార్కింగ్ స్థలం, సభా స్థలి, శంకుస్థాపన చేసే కార్యక్రమ స్థలాలను వారు పరిశీలించారు. అనంతరం ఆయా చోట్ల తీసుకోవాల్సిన జాగ్రత్త లపై అధికారులకు తగు సూచనలు చేశారు. కార్యక్రమాలు జరుగుతున్న చోట్ల, మంచినీటి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని అధికారులను, గ్రామ కార్యదర్శులను , ఇతర సిబ్బందిని నియమించి పారిశుద్ధ్య పనులు నిర్వర్తించాలని, రోడ్లపై నీటిని చల్లి, దుమ్ము లేవకుండా చేయాలని మంత్రి హనుమకొండ డీఆర్డీఓ శ్రీనివాస్ కుమార్ ను ఆదేశించారు.

అధికారులంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు. అధికారులతో కొద్దిసేపు మాట్లాడి పర్యటన రోజు కార్యక్రమాలపై సమీక్షించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య,ఎమ్మెల్సీ, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఈ నెల 27న ఒకే రోజు రూ.150 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. అత్యంత ఎత్తుగా ఉన్న, కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్న ఆ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందించే 3 ఎత్తిపోతల ప్రాజెక్టులకు, వివిధ రోడ్లకు శంకుస్థాపనలు జరుగుతాయన్నారు.

అనంతరం ఈ ప్రాంతానికి సాగు,తాగు నీరు అందేలా చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతగా ఈ ప్రాంత రైతులు కృతజ్ఞత సభ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. భారీ ఎత్తున నిర్వహించే ఈ కృతజ్ఞత సభ దాదాపు 30వేల మందితో ఘనంగా జరుగుతుందన్నారు. కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయడానికి పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజలు కదలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు,ఆర్ అండ్ బీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, జనగామ పార్టీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, లింగాల ఘనపూర్ జెడ్పీటీసీ గుడి వంశీ ధర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.