ఈ యేడాది కూడా ఏపీకి రాని రైళ్లు!

ఈ యేడాది కూడా ఏపీకి రాని రైళ్లు!

వరంగల్ టైమ్స్, ఏపీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు ముందుకు కదలడం లేదు. ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ ఏ పనులూ చేయడం లేదు. పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమావేశాలు పెట్టిన ప్రతిసారీ వైఎస్సార్సీపీ ఎంపీలు నిధులు గురించి అడిగినప్పుడల్లా మీ రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్లే పనులు జరగడం లేదని రైల్వే మంత్రి చెప్పడంతో రాష్ట్రం పరువుపోతోంది. నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగళూరు వంటి కీలకమైన కొత్తలైన్ల పనులు గతంలో వేగంగా జరిగినప్పటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వాటా ఇవ్వకుండా చేతులెత్తేయడంతో అవన్నీ మూలనపడ్డాయి. రాజధాని అమరావతి మీదుగా వెళ్లే 106 కి.మీ. లైనుకు డీపీఆర్ సిద్ధమైనా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది.

అలాగే విశాఖ కేంద్రంగా 4యేళ్ల క్రితం ప్రకటించిన దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పాటులోనూ సాగదీత ధోరణి అవలంబిస్తున్నారు. ఈ జోన్ కార్యకలాపాలు ప్రారంభమవ్వాలంటే ప్రధాన కార్యాలయ భవన నిర్మాణం పూర్తవ్వాలి. స్థలం గుర్తించినా ఇప్పటికీ శంకుస్థాపనే చేయలేదు. విశాఖ జోన్, రాయగడ్ డివిజన్ ఏర్పాటుకు రూ.170 కోట్లు అవసరం కాగా గత మూడు బడ్జెట్లలో కలిపి కేవలం రూ.3.80 కోట్లే కేటాయించింది. దీనిలో కేవలం రూ.14 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. కొత్తజోన్ ఏర్పాటు లాభదాయకం కాదంటూ రైల్వేబోర్డు ప్రకటించినా ఆ తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.ఈ యేడాది కూడా ఏపీకి రాని రైళ్లు!*రూ.వెయ్యి కేటాయించిన కేంద్రం :
రాష్ట్రంలో అనేక కొత్త లైన్లు మంజూరై డీపీఆర్‌లు సిద్ధమైనప్పటికీ కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయించడం లేదు.రాష్ట్ర రాజధాని ప్రాంతం అమరావతి మీదుగా వెళ్లేలా ఎర్రుపాలెం-అమరావతి- నంబూరు డబుల్ లైన్, అమరావతి-పెదకూరపాడు, సత్తెనపల్లి-నరసరావుపేట మధ్య కొత్త సింగిల్ లైన్లు కలిపి మొత్తం 106 కి.మీ.ప్రాజెక్టు మంజూరు చేశారు. 2,679 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేయగా, బడ్జెట్‌లో దీనికి కేవలం వెయ్యిరూపాయలు కేటాయించారు. ఈ ప్రాజెక్టులో కొంత రాష్ట్రం భరించాలని రైల్వే శాఖ కోరుతుంటే,విభజన హామీ కింద కేంద్రమే మొత్తం భరించాలంటూ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.

భద్రాచలం-కొవ్వూరు మధ్య 151 కి.మీ. మేర 2,155 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాల్సిన కొత్త లైనులో సగం వ్యయం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు భరించాలని రైల్వే శాఖ కోరింది. దీంతో విభజన హామీలో భాగంగా ఏపీ రాజధాని నుంచి హైదరాబాద్ తో పాటు, తెలంగాణలో వివిధ ప్రాంతాలకు నిర్మించాల్సిన రోడ్లు, రైలు మార్గాల కింద ఈ ప్రాజెక్టును కేంద్రమే చేపట్టాలని ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో గత బడ్జెట్‌లో కేంద్రం ఈ ప్రాజెక్ట్‌కూ కేవలం వెయ్యి రూపాయలే కేటాయించింది. అలాగే మాచర్ల-నల్గొండ, కాకినాడ-పిఠాపురం, గూడూరు-దుగరాజపట్నం, కంభం-ప్రొద్దుటూరు, కొండపల్లి-కొత్తగూడెం లైన్లు మంజూరైనా బడ్జెట్‌లో వెయ్యిచొప్పున కేటాయించి రైల్వేశాఖ చేతులు దులుపుకుంది.

*కొండంత ఆదాయం..గోరంత నిధులు :
ప్రయాణికులు, సరకు రవాణాలోనూ ఏపీనుంచి రైల్వేశాఖకు భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ బడ్జెట్‌ కేటాయింపుల్లో మాత్రం కేంద్రం మొండిచేయి చూపుతోంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి రైల్వే శాఖకు గతేడాది రూ.14వేల266 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.13వేల787 కోట్ల ఆదాయం వచ్చింది. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లకు గతేడాది కేవలం రూ.7032 కోట్లు మాత్రమే లభించాయి. రాష్ట్రంలో మరో ముఖ్య డివిజన్ ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌ పరిధిలోని వాల్తేర్‌ డివిజన్‌ నుంచి గతేడాది రూ.7,902 కోట్ల ఆదాయం లభించగా, కేవలం రూ.2,552 కోట్ల మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారు.

*రాష్ట్ర ప్రభుత్వం కినుకు :
కీలకమైన రైల్వేప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకుండా చేతులెత్తేసింది. నడికుడి-శ్రీకాళహస్తి, కోటిపల్లి-నరసాపురం, కడప-బెంగళూరు, రాయదుర్గం-తుముకూరు కొత్త లైన్ల నిర్మాణంలో రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో మూడున్నరేళ్లుగా ఈ ప్రాజెక్టుల్లో ఒక్క అడుగు కూడా పడలేదు. నడికుడి-శ్రీకాళహస్తి ప్రాజెక్ట్‌ విలువ రూ.2,700 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.1,350 కోట్లు ఇవ్వడంతో పాటు భూసేకరణ జరిపి ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం మాత్రం కేవలం రూ.6 కోట్లు మాత్రమే ఇచ్చింది. కోటిపల్లి-నరసాపురం లైన్‌కు రూ.2,125 కోట్లు అవసరం కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.525 కోట్లలో కేవలం రూ.2.69 కోట్లు మాత్రమే ఇచ్చింది.

రాయదుర్గం-తుముకూరు లైన్‌లో మన రాష్ట్ర పరిధిలో 63 కి.మీ. ఆరేళ్ల కిందటే పూర్తి కాగా, మిగిలిన 30 కి.మీ. పనుల్లో ప్రగతి లేదు.రాష్ట్ర వాటా రూ.484కోట్లు కాగా, గతంలో రూ.230 కోట్లు మాత్రమే ఇచ్చారు. కడప- బెంగళూరు లైన్‌కి రూ.2,849 కోట్లలో రాష్ట్ర వాటా రూ.1,425కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.190 కోట్లు మాత్రమే డిపాజిట్ చేసింది. దీంతో కడప నుంచి పెండ్లిమర్రి వరకు 21 కి.మీ. నిర్మాణమే పూర్తి చేశారు. ఇప్పుడు ఈ లైను ఎలైన్మెంట్ మార్చాలని, ముదిగుబ్బ వరకు నిర్మించి, ధర్మవరం- బెంగళూరు లైనుకు అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

*సమావేశానికి అనాసక్తత :
కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రతీసారీ దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్ రాష్ట్ర ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రానికి ఏం కావాలో వినతులు స్వీకరించే వారు. ఈ సారి ఈ సమావేశం కూడా నిర్వహించలేదు.